Trishul News

అయ్యప్ప మండలకాల దీక్షతీసుకుని దైవత్వాన్ని చాటండి..!

- అఖిలభారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ సభ్యులు జనగామ తిరుపతి 
 గోదావరిఖని, త్రిశూల్ న్యూస్ :
అయ్యప్ప స్వామి మండలకాల దీక్ష తీసుకుని దైవత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి అని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యులు జనగామ తిరుపతి అన్నారు. శనివారం ఉదయం ఎన్ టిపిసి హరి హర దేవాలయం ప్రాంగణంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో ఆలయ పూజారి, గురుస్వామి వామనశర్మ చేతుల మీదుగా అయ్యప్ప మాల ధరించి అనంతరం గురు స్వాముల ద్వార తెలుసుకున్న విషయాలను మరియు వివిధ పుస్తకాలలొ వివరించిన అయ్యప్ప స్వామి విశిష్టతలను నియమాలను అఖిలభారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ సభ్యుడు జనగామ తిరుపతి అయ్యప్ప ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా వెల్లడించారు. పదునెనిమిది మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో దేవత వుంటుంది అని మోక్ష సామ్రాజ్య కైవసానికి ఈ మెట్లు ఉపకరణాలు అని శాస్త్రం చెప్పుతుంది అని తెలిపారు. ఈ సోపానాలపై పద్దెనిమిదిమంది దేవతలను ఆవాహన చేశారు అని ఎనిమిది మంది దిక్పాలకులు, నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అవిద్య, విద్య, జ్ఞానం, అజ్ఞానం అన్నీ కలిపి మొత్తం పద్దెనిమిది మెట్లుగా ఇక్కడ వున్నాయి అని అన్నారు. నలభై ఒక్క రోజులు దీక్ష చేసి ఇరుముడితో వెళ్ళినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కడానికి అర్హులు అని అన్నారు. ఈ మెట్ల క్రింద ఎంతో మహిమాన్వితమైన, పవిత్రమైన యంత్రస్థాపన జరిగింది అని యంత్ర ప్రతిష్ట ఎంతో పునీతమూ, శక్తిమంతము కాబట్టే వాటిని ఎంతో భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో, నియమ నిష్టలతో ఎక్కాలి అన్నారు.
అయ్యప్ప దీక్షకు చన్నీటి స్నానం, భూశయనం, పాదచారులై నడవడం, ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం, మద్యమాంసాదులు, మసాల దినుసులు వంటి తామసకారకాలైన పదార్థాలను త్యజించడం వంటి నియమాలు పాటించాలి అని అన్నారు. మాల ధరించిన స్వాములు రెండుపూటలా చన్నీళ్ళ స్నానం చేయడం వల్ల వారికి మంచి ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాక, మనసును ప్రశాంతంగా ఉంచి భగవధ్యానానికి తోడ్పడుతుంది అని అన్నారు. తులసి, రుద్రాక్షల లోని స్వాభావిక ఔషధ గుణాలు అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతాయి అని రక్తపోటు, మధుమేహం మొదలైన ఎన్నో రోగాల అదుపుకు ఉపకరిస్తాయి అని ఆయన తెలిపారు. దీక్షాలో ప్రత్యేక ఆహార నియమాలతో పాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని దీక్షలో ఓభాగంగా విధించారు అని అన్నారు. చెప్పులు తొడగరాదనే నియమం వెనుక ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి అని ఇందువల్ల భక్తులకు కష్టాలను సహించే శక్తి కలుగుతుంది అని శరీరం అంతా రక్త ప్రసరణ సక్రమంగా అవుతుంది అని అన్నారు. అయ్యప్ప దీక్షలో దరించే నలుపు రంగు వస్త్రాలు తమోగుణాన్ని సూచిస్తుంది అని అన్నారు. పంబా తీరంలో వంట చేసిన 108 పొయ్యిల నుంచి సేకరించిన బూడిదను జల్లించి స్వామికి అభిషేకించగానే దానికి ఎనలేని శక్తి కలిగి సర్వరోగ నివారిణిగా తయారై ప్రాణదాతగా ఉపయోగపడుతుంది అని అటువంటి మహిమాన్వితమైన విభూతి, గంధం ధరించడం వల్ల చక్కటి వర్చస్సు, మనోబలం కలుగుతాయి అన్నారు. అంతేకాక వాత, పిత్త, కఫం వంటి రోగాలు కూడ దరిచేరవు తెలిపారు. స్వాములు కులమతాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటే అనే సంకేతాన్ని కూడ సమాజంలోకి పంపుతున్నారు అని అన్నారు. మండల దీక్షను ముగించుకొని దర్శనానికి వెళ్ళే స్వాముల ఇరుముడిలో రెండు భాగాలు వుంటాయి అని ముందు భాగంలో పూజాసామాగ్రి, వెనుక భక్తులకు కావలిసిన వస్తువులు, తినుబండారాలు ఉంటాయి అని అన్నారు. ముందు భాగంలో ఉండే ఆవునెయ్యి భక్తుని ఆత్మతో సమానం అని కొబ్బరికాయ దేహంతో సమానం అనగా భక్తులైన వారు ఆత్మతో సమానమైన నేతితో స్వామికి అభిషేకం చేసి (ఆత్మార్పణ గావించి) దేహం వంటి కొబ్బరికాయను స్వామి సన్నిధిలోగల హోమగుండంలో వేస్తారు అని ఈ సందర్బంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యులు జనగామ తిరుపతి వివరించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు నందం నాగవర్దన్ రావు, చిప్ప క్రిష్ణప్రసాద్, శ్రీధర్, కృష్ణ ప్రసాద్, ముదిగంటి చంద్రారెడ్డి స్వామి, సత్తు శ్రీనివాస్ ,రాజేందర్ , పి. సంపత్ రావు, హరి , కార్తికేయన్ మరియు కేరళ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post