Trishul News

వైఎస్ షర్మిల గురి జగన్ పైనేనా..?

హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
వైఎస్ షర్మిల. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం. తెలంగాణ లో వైఎస్ షర్మిల రాజకీయ లక్ష్యం ఏంటి. సుదీర్ఘ పాదయాత్ర చేస్తన్న షర్మిల గురి ఎవరి పైన. ఇప్పుడు తెలంగాణ లోనే కాదు.. ఏపీలోనూ షర్మిల రాజకీయ అడుగుల పైన చర్చ మొదలైంది. అన్నతో విభేదించి తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిలకు రాజకీయంగా తొలి నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు రాలేదు. కానీ, గత నాలుగు రోజుల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో ఒక్క సారిగా రాజకీయంగా షర్మిల వైపు టర్న్ తీసుకుంది. ఇదే సమయంలో షర్మిల తక్షణ లక్ష్యం ఏంటనేది స్పష్టం అవుతోంది.

నాడు అన్న వదలిన బాణంగా...
వైఎస్సార్ మరణం తరువాత జగన్ కు మద్దతుగా ఆ కుటుంబం మొత్తం ఒక్కటిగా నిలిచింది. జగన్ కోసం షర్మిల 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ తల్లితో కలిసి ప్రచారం చేసారు. మొత్తం 18 స్థానాల్లో 15 స్థానాల్లో ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో షర్మిల అన్న పార్టీ కోసం ప్రచారం చేసారు. 2019 ఎన్నికల్లోనూ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతీ సభలో బైబై బాబు అంటూ షర్మిల చేసిన నినాదం ఆ ఎన్నికల్లో వైసీపీ స్లోగన్ గా మారిపోయింది. జగన్ ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన తరువాత కొంత కాలానికే షర్మిల తెలంగాణలో పార్టీ దిశగా అడుగులు వేసారు. షర్మిల తెలంగాణ వేదికగా రాజకీయం చేయటం జగన్ కు ఇష్టం లేదు. అభ్యంతరం వ్యక్తం చేసారు. కానీ, షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసారు. తల్లి మద్దతు లభించింది. అప్పటి నుంచి వైఎస్సార్ జన్మదినం - వర్దంతి రోజుల్లో మాత్రమే ఇడుపుల పాయ వేదికగా సీఎం జగన్..షర్మిల కలుసుకుంటున్నారు.

రెండు రాష్ట్రాల్లో అన్నా - చెల్లి భిన్న మార్గాల్లో..
ఇప్పుడు ఏపీ సీఎంగా జగన్ పూర్తిగా ఆ రాష్ట్రానికే పరిమితం అవుతున్నట్లు స్పష్టం చేసారు. పొరుగు రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం ఉండదని పార్టీ విధానంగా నిర్ణయించారు. ఇటు షర్మిల తాను తెలంగాణ కోడలిని అంటూ ఇక్కడ రాజన్న రాజ్యం తెస్తానంటూ పాదయాత్ర చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు నుంచి స్వల్ప సంఖ్యలోనే షర్మిలకు మద్దతు లభించింది. తల్లి విజయమ్మ పలు సందర్బాల్లో షర్మిల దీక్షలు - సమావేశాల్లో పాల్గొన్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసారు. విజయమ్మ తన కుమార్తెకు మద్దతుగా నిలవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇక, ఇప్పుడు షర్మిల ఆగిపోయిన తన పాదయాత్ర తిరిగి ప్రారంభించారు. ఈ నెల 14వ తేదీతో తన యాత్ర ముగుస్తుందని ప్రకటించారు. షర్మిల బీజేపీ వదిలిన బాణంగా టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. తనకు ఎవరి మద్దతు లేదని..తనది ఒంటరి పోరాటమని షర్మిల తేల్చి చెప్పారు. ఇక, రాజకీయంగా షర్మిల తెలంగాణ ఎన్నికల్లో ఏ స్థాయిలో పోరాటం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

జగన్ రికార్డులపైనే షర్మిల గురి పెట్టారా.. గతంలో ఉమ్మడి ఏపీలో తన అన్న జగన్ కోసం షర్మిల పాదయాత్ర చేసారు. 2012 లో 230 రోజులు పాటు 3600 కిలో మీటర్ల మేర షర్మిల యాత్ర సాగింది. ఒక మహిళగా ఆ రికార్డు ఏపీలో నిలిచిపోయింది. ఆ తరువాత జగన్ ఏపీలో పాదయాత్ర చేసారు. జగన్ పాదయాత్ర ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రికార్డుగా నిలిచింది. మొత్తం 341 రోజుల పాటు 3,648 కిలో మీటర్లు జగన్ పాదయాత్ర సాగింది. ఇప్పుడు షర్మిల తన అన్న జగన్ రికార్డును బ్రేక్ చేసేందుకు సిద్దమయ్యారు. 2021 అక్టోబర్ లో తెలంగాణలోని చేవెళ్లలో షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే 3500 కిలో మీటర్లకు పైగా షర్మిల పాదయాత్ర పూర్తయింది. ఈ నెల 14వ తేదీ వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అప్పటికి జగన్ నెలకొల్పిన 3,648 కిలో మీటర్ల రికార్డును బ్రేక్ చేయటం షర్మిల తక్షణ కర్తవ్యంగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణం అవుతోంది.

Post a Comment

Previous Post Next Post