Trishul News

తెలంగాణలో మోదీ పర్యటనను అడ్డుకుంటాం - సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

హైదరాబాద్‌, త్రిశూల్ న్యూస్ :
ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ కార్యక్రమాల్లో పాల్గొనే నైతిక హక్కు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మోదీ సాంకేతికంగానే ప్రధాని అని.. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఆయన చేసిన మంచి పని ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని నిర్వీర్యం చేస్తున్నారని.. మోదీ తెలంగాణకు రావడానికి వీలులేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని చెప్పారు.
''విభజన హామీలు, బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీ విద్యాలయం హామీలు ఏమయ్యాయి? బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో చెప్పించారు. ఈనెల 10 నుంచి సింగరేణి బొగ్గు గనుల్లో ఆందోళనలు చేపడతాం. 12న రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని పర్యటనను అడ్డుకుని తీరుతాం. గవర్నర్‌ తమిళిసై రాజకీయ పద్ధతిలో మాట్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాలను అవమానించేలా ఆమె వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి. రాష్ట్రం నుంచి గవర్నర్‌ వెళ్లిపోవాలని రాజ్‌భవన్‌ను త్వరలో ముట్టడిస్తాం. మాకు ప్రధాన శత్రువు భాజపా. వామపక్షాలు, తెరాస కలిసి మోదీ పర్యటనను అడ్డుకుంటాయి. ఈ పోరాటంలో కాంగ్రెస్ కలిసి వస్తే స్వాగతిస్తాం'' అని కూనంనేని చెప్పారు.

Post a Comment

Previous Post Next Post