Trishul News

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం..72 మంది దుర్మరణం..!

ఖాట్మండు, త్రిశూల్ న్యూస్ :
నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవుతూ యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన 72 సీటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కుప్పకూలిన ఘటనలో 72 మంది దుర్మరణం పాలయ్యారు. నేపాల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ మేరకు నేపాల్‌ పౌర విమానయాన శాఖ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందన్న సంగతి మాత్రం చెప్పలేదు. యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్‌ 72 విమానం కాఠ్‌మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని ఫొఖారాకు వెళ్తుండగా టేకాఫ్‌ అయిన 20 నిమిషాలకే ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 25 నిమిషాలు మాత్రమే. అంటే మరో 5 నిమిషాల్లో విమానం గమ్యం చేరుకుంటుదనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సేతి నదీ తీరంలో కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో 68 మంది ప్రయాణికులతోపాటు నలుగురు సిబ్బంది ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ప్రమాదం జరిగిన ప్రాంతం పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం, పాత విమానాశ్రయాల మధ్యన ఉంది. స్థానిక మీడియా కథనాల మేరకు.. ఇప్పటి వరకు 32 మృతదేహాలను వెలికితీశారు. అయితే, ప్రమాదం నుంచి ఎవరైనా బయటపడ్డారా? అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదని యతి ఎయిర్‌లైన్స్‌ అధికార ప్రతినిధి సుదర్శన్‌ బర్తౌలా వెల్లడించారు.
జ్యోతిరాదిత్య సింధియా సంతాపం..

నేపాల విమాన ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి భారత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంతాపం తెలిపారు. ఈ ఘటన తనను కలచివేసిందన్నారు. '' ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అంటూ సింధియా ట్వీట్‌ చేశారు. స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నట్లు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. కాఠ్‌మాండూ, పొఖారా హెల్ప్‌లైన్‌ నంబర్లను కూడా ట్విటర్‌లో షేర్‌ చేసింది. బాధితుల వివరాల కోసం కాఠ్‌మాండూ 9851107021, పొఖారా: 9856037699 నంబర్లను సంప్రదించాలని కోరింది.

Post a Comment

Previous Post Next Post