Trishul News

నేడు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల - టిటిడి

తిరుమల, త్రిశూల్ న్యూస్ :
తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్తను అందించింది. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ఆగస్టు 7 నుంచి 10 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మూడు రోజుల పాటు రూ.300 దర్శన టికెట్ల కోటాను గతంలో టీటీడీ నిలుపుదల చేసింది. అయితే ఆ టిక్కెట్లను ఈరోజు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. టీటీడీ వెబ్‌సైట్ ద్వారా తిరుమలకు వెళ్లాలని భావిస్తున్న భక్తులు ఆ టికెట్లను పొందవచ్చు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు కలిగిన భక్తులకు దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆగస్టు 7 నుంచి ఆగస్టు 10 వరకు సంబంధించిన దర్శనం టిక్కెట్లు ఈరోజు భక్తులకు అందుబాటులో ఉంటాయి. కాగా గరుడ పంచమి సందర్భంగా తిరుమలలో మంగళవారం నాడు గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో భక్తులకు శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో బాలాజీనగర్‌లో టీటీడీ శ్రమదానం కార్యక్రమం నిర్వహిస్తోంది. అటు ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఆలయ పవిత్రతను, పరిశుభ్రతను అవధారణ చేసేందుకు ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఒకరకంగా ఇది శుద్ధీకరణ కార్యక్రమంగా చెప్పవచ్చు. ఏడాది పాటు శ్రీవారికి నిత్య పూజలు, ఉత్సవాలు, కైంకర్యాలు జరుగుతుంటాయి కాబట్టి మంత్రదోష, క్రియాదోష, కర్తవ్య దోషాలను తొలగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల ముందు రోజు అంకురార్పణ జరుగుతుంది. ఏకాదశినాడు పవిత్ర ప్రతిష్ఠ, ద్వాదశి నాడు పవిత్ర సమర్పణ, త్రయోదశి నాడు పూర్ణాహుతి ఉత్సవం జరుగుతుంది. మలయప్ప స్వామికి, ఉభయ దేవేరులకు పవిత్ర మాలల సమర్పణ, ఊరేగింపు కార్యక్రమంతో దోష పరిహారం పూర్తవుతుంది.

Post a Comment

Previous Post Next Post