Trishul News

రాయలసీమ సత్యాగ్రహ దీక్షకు వామపక్షాలకు ఆహ్వానం..!

- ఈ నెల 16 న రాయలసీమ హక్కుల పత్రంపై దీక్ష
విజయవాడ, త్రిశూల్ న్యూస్ :
రాయలసీమ సత్యాగ్రహ దీక్ష లో పాల్గొని సంఘీభావం తెలిపి రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒడంబడిక అమలుకు సహకరించాలని విజయవాడ వామపక్ష రాష్ట్ర నాయకులను ఆహ్వానించినట్లు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి తెలిపారు. బుధవారం విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రచార కార్యదర్శులు ఎం.వి. రమణారెడ్డి, నిట్టూరు సుధాకర్ రావులు సిపిఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ , సిపిఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి కిషోర్ బాబు, సిపిఐ(ఎంఎల్) న్యూ డెమొక్రసి రాష్ట్ర నాయకులు కె.పొలారి, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ రాష్ట్ర నాయకులు హరినాథ్, ఎంసీపీఐ(యు) రాష్ట్ర నాయకులు ఖాదర్ బాష, ఎస్ యుటిఐ  రాష్ట్ర నాయకులు సుధీర్ లను కలిసి రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక ఆద్వర్యంలో ఈ నెల 16 న విజయవాడ ధర్నా చౌక్ లో రాయలసీమ సత్యాగ్రహ దీక్ష జరుగుతుందనీ, వామపక్ష ప్రజా ప్రతినిధులు సత్యాగ్రహ దీక్షలో పాల్గొని సంఘీభావం తెలుపాలని వారు విజ్ఞప్తి చేసినట్లు బొజ్జా దశరథరామిరెడ్డి వివరించారు. శ్రీబాగ్ ఒడంబడిక, రాష్ట్ర విభజన చట్టాలలో రాయలసీమ అభివృద్ధికి కల్పించిన హక్కుల సాధనకు రాయలసీమ సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్నామనీ, రాయలసీమ ప్రాంతం కోస్తాంధ్ర ప్రాంతంతో సమానంగా అభివృద్ధికై 1937 నవంబర్ 16 న రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒడంబడిక జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 లో కూడా అన్ని రంగాలలో వెనుకబడిన రాయలసీమ ప్రాంతం కోస్తాంధ్ర ప్రాంతంతో సమానంగా అభివృద్ధికి అనేక హక్కులు కల్పించిన విషయం వామపక్ష నాయకులకు వివరించామన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక జరిగి 85 సంవత్సరాలైనా శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో తెలుగు రాష్ట్రం ఏర్పడి 70 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు రాష్ట్ర విభజన చట్టం చేసి 8 సంవత్సరాలైనా రాయలసీమ హక్కులు, అభివృద్ధి పట్ల పాలకులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన, పేదలపక్షాన నిలిచి పోరాడే వామపక్ష పార్టీలు రాయలసీమ హక్కుల పత్రం అమలు సాధన దిశగా పాలకులపై ఒత్తిడి పెంచాలని బొజ్జా దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కూడా ఆహ్వాన పత్రం అయన అందజేశారు.

Post a Comment

Previous Post Next Post