Trishul News

ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్‌గా జవహర్‌ రెడ్డి..?

- సమీకరణాలన్నీ జవహర్‌ రెడ్డికే అనుకూలిస్తున్నాయి. 

- నెలాఖరుతో ముగియనున్న సమీర్‌ శర్మ గడువు

- రేసులో శ్రీలక్ష్మి, జవహర్‌ రెడ్డి.. జవహర్‌కే దక్కనున్న చాన్స్‌
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
కాబోయే చీఫ్‌ సెక్రటరీ ఎవరు..? ఆ పదవి దక్కేది ఎవరికి? శ్రీలక్ష్మికా? జవహర్‌ రెడ్డికా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... సమీకరణాలన్నీ జవహర్‌ రెడ్డికే అనుకూలిస్తున్నాయి. కాబోయే సీఎస్‌ ఆయనే అని అధికారవర్గాలు చెబుతున్నాయి. అసాధారణ స్థాయిలో ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు పొందిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ పదవీకాలం ఈనెల 30వ తేదీతో ముగుస్తోంది. ఆయన 2021 అక్టోబరు 1న సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది నవంబరు 30తో ఆయన రిటైర్‌ కావాల్సింది. అయితే... రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు కేంద్రం ఆయన సేవలను మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ ఏడాది మే 30 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమీర్‌ శర్మ పదవీకాలాన్ని మరో ఆరునెలలు పొడిగించాలని మరోసారి కేంద్రాన్ని కోరింది. అసాధారణ రీతిలో కేంద్రం ఈ ప్రతిపాదనను కూడా అంగీకరించింది. అంటే... ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనుంది. సమీర్‌ శర్మను వదులుకోవడం ఇష్టంలేకో... మరో కారణంవల్లో 2023 నవంబరువరకు ఆయన పదవీకాలం పెంచాలని కేంద్రాన్ని మరోసారి అడిగారు. కేంద్రం అందుకు అంగీకరించలేదు. ఇటీవల ఆయన ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. దీంతో ఈ నెలాఖరుతో ఆయన పదవీ విరమణ ఖాయమైంది.

శ్రీలక్ష్మికి అవకాశం లేనట్లే..?

సమీర్‌ శర్మ తర్వాత ఏపీ కేడర్‌కు చెందిన వారిలో 17 మంది స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలున్నారు. వీరందరిలో... పూనం మాలకొండయ్య, శ్రీలక్ష్మి, జవహర్‌ రెడ్డి పేర్లు మాత్రమే తదుపరి సీఎస్‌ పదవికి వినిపిస్తున్నాయి. సమీర్‌ శర్మకు రెండోసారి పొడిగింపు రాకముందు తదుపరి సీఎస్‌ తానే అని పూనం మాలకొండయ్య (1988 బ్యాచ్‌) గట్టిగా భావించారు. ఇప్పుడు ఎందుకోగానీ ఆమె నిశ్శబ్దం వహించారు. ఆమె సీఎస్‌ ఆయ్యే చాన్స్‌ లేదని ఐఏఎస్‌ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పుడు శ్రీలక్ష్మి, జవహర్‌ రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఓబుళాపురం గనుల కేసులో ఆమెపై అభియోగాలను తెలంగాణ హైకోర్టు రెండు రోజుల కిందటే కొట్టివేసింది. దీంతో... సీఎస్‌ పోస్టు దక్కించుకునేందుకు ఆమెకు లైన్‌ క్లియర్‌ అయింది. అయితే... ఆమెకు ఇంకా నాలుగేళ్ల సర్వీసు ఉంది. 2024 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిపోతే... తదుపరి సర్కారు ఆమెను పక్కకు తప్పించి, అప్రాధ్యాన్య పోస్టులో నియమించవచ్చు. ఇది ఆమెకు ఇబ్బందికర పరిణామమే అవుతుంది. ఎలాగూ నాలుగేళ్ల సర్వీసు ఉన్నందున ఎన్నికల తర్వాతే ఈ పదవి గురించి ఆలోచించవచ్చునని శ్రేయోభిలాషులు సూచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు శ్రీలక్ష్మికి సీఎస్‌ పదవి అప్పగించడంపై జగన్‌ కోటరీలో కొందరు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గం, విధేయత, ఇలా ఏ కోణంలో చూసినా జవహర్‌ రెడ్డికే సీఎస్‌ పోస్టు కట్టబెట్టాలని భావిస్తున్నారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో ప్రయోగాలు చేయడం సరికాదనే అంచనాకు వచ్చారని... జవహర్‌ రెడ్డినే సిఎస్ ఎంపిక చేయడం ఖాయమని చెబుతున్నారు.

Post a Comment

Previous Post Next Post