Trishul News

మన్మోహన్ సింగ్ కు బీజేపీ అగ్ర నేత ప్రశంసలు..!

- సంచలనంగా మారిన గడ్కరీ ప్రశంసలు
న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ :
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు అనూహ్యంగా ప్రత్యర్థి పక్షానికి చెందిన సీనియర్ నాయకుడి నుంచి ప్రశంసలు లభించాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారత దేశం రుణపడి ఉందని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ప్రత్యర్థి పక్షమైన కాంగ్రెస్ నాయకుడిని బీజేపీ సీనియర్ నేత ప్రశంసించడం సంచలనంగా మారింది. 1991లో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు దేశానికి నూతన దిశానిర్దేశం చేశాయని గడ్కరీ ప్రశంసించారు. దివాలా స్థితి నుంచి ఆర్థికంగా పునరుజ్జీవన స్థితికి భారత్ రావడానికి మన్మోహన్ ప్రారంభించిన ఆర్థిక విధానాలే కారణమన్నారు. మన్మోహన్ సింగ్ ప్రారంభించిన నూతన ఆర్థిక విధానాలతో భారత్ లిబరల్ ఎకానమీగా రూపొందిందని టైల్ అవార్డ్స్ 2022 కార్యక్రమంలో ప్రసంగిస్తూ గడ్కరీ వివరించారు. లిబరల్ ఎకనమిక్ పాలసీల ద్వారా లభించిన ప్రయోజనాలు పేదలకు, రైతులకు అందాయన్నారు. ఈ విధానాలను ప్రారంభించిన మన్మోహన్ సింగ్ కు దేశం రుణపడి ఉందన్నారు. లిబరల్ ఎకనమిక్ విధానాల కారణంగా మహారాష్ట్ర మంత్రిగా తాను కూడా రోడ్ల నిర్మాణానికి నిధులను సేకరించగలిగానని తెలిపారు. ఈ ఉదారవాద ఆర్థిక విధానాలతో ప్రయోజనం పొందిన దేశాల్లో చైనా కూడా ఒకటని వివరించారు. కేంద్ర రహదారుల మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రశంసల వర్షం కురిపించడం సంచలనంగా మారింది. సాధారణంగా ప్రత్యర్థి పక్షంపై బహిరంగంగా ప్రశంసలు కురిపించడం చాలా అరుదు. అదీకాకుండా దేశం ప్రస్తుత దుస్థితికి గత కాంగ్రెస్ పాలకుల అసమర్ధ పాలనే కారణమని ప్రధాని మోదీ ప్రతీ సందర్భంలో విరుచుకుపడుతుంటారు. అలాంటిది ఆయన కేబినెట్ లోని సీనియర్ సహచరుడే ప్రత్యర్థి పక్షం ప్రధానిని ప్రశంసించారు. దీనిపై బీజేపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందని రాజకీయ వర్గాలు చూస్తున్నాయి.

Post a Comment

Previous Post Next Post