Trishul News

మాజీ ఐఏఎస్, ఐపిఎస్ ల చూపు జనసేనవైపేనా..?

- త్వరలో పార్టీలో చేరుతున్నట్టు జోరుగా ప్రచారం
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోనే కనిపిస్తున్నాయి. ఇటు అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం సైతం దూకుడుగా ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థులను సైతం ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే జనసేన ఈ విషయం ప్రస్తుతానికి వెనుకబడే ఉంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు.. ముఖ్యంగా పొత్తులపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.. దానిపై క్లారిటీ వచ్చిన తరువాతే.. అభ్యర్థులను ఎంపిక చేయాలని అధినేత భావిస్తున్నారు. అయితే తమకు పూర్తి బలం ఉన్నచోట్ల మాత్రం.. అభ్యర్థులను ఫైనల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కొందరు మేథావులు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయంగా యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారంతా.. త్వరలోనే జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన అయితేనే తమకు మంచి వేదిక అవుతుందని వారు అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. వారంతా త్వరలోనే జనసేనలో చేరే చాన్స్ ఉందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. అలాంటి వారిలో లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. లోక్ సత్తా ఉద్యమసంస్థను స్థాపించి సమాజంలో మార్పు తీసుకురావాలని ఆయన భావించారు. రాజకీయ పార్టీగా మార్చి ఉమ్మడి ఏపీలో ఒకసారి బరిలో దిగారు. కానీ అంతగా వర్కవుట్ కాలేదు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో కుక్కట్ పల్లి నుంచి పోటీచేసిన జేపీ ఒక్కరే గెలుపొందారు. నాడు శాసనసభలో వాయిస్ వినిపించారు. కానీ పార్టీ పరంగా ప్రభావం చూపలేక పోయారు. రాష్ట్ర విభజన తరువాత లోక్ సత్తా పార్టీ అంతగా ఉనికి చాటుకోలేకపోయింది. కానీ గత కొన్ని రోజుల నుంచి ఆయన మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలి అనుకుంటున్నారని టాక్. అయితే సొంతగా పోటీ చేయడం.. లేకపార్టీ పెట్టడం కన్నా.. యువతో ఆదరణ ఉన్న జనసేన వైపు మొగ్గుచూపడం మంచిది.. అని పవన్ భావాలు సైతం తనకు కాస్త దగ్గరగానే ఉన్నాయని.. అందుకే జనసేనలో చేరడమే మంచిదని ఆయన ఫిక్స్ అయినట్టు సమాచారం. ఆయన ప్రధానంగా విజయవాడ లేదా విశాఖ నుంచి బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఉత్తరాంధ్రలో పర్యటించిన జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ వెంట లోక్ సత్తా నాయకులు కొంతమంది కనిపించడం వెనుక కారణం ఇదే అంటున్నారు. మరోవైపు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మళ్లీ జనసేనలోకి చేరుతారని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై చర్చలు కూడా పూర్తి అయ్యాయని టాక్. గత ఎన్నికల్లో ఆయన విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేశారు. దాదాపు 3 లక్షలకుపైగా ఓట్లు సాధించారు. ఎన్నికలకు కేవలం 15 రోజల ముందు జనసేనలో చేరిన ఆయన గట్టిపోటీ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల పవన్ మళ్లీ సీనిమాలు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు. కానీ ప్రజల్లోనే ఉన్నారు. వివిధ సమస్యలను అజెండాగా రూపొందించుకొని పోరాటం చేస్తున్నారు. ప్రధానంగా రైతాంగ సమస్యలపై ఫోకస్ పెంచారు. స్టీల్ ప్లాంట్ విషయం న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో మళ్లీ జనసేనలోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వాల్లో క్రియాశీలకంగా పనిచేసిన చాలామంది మేథావులు, మాజీ అధికారులు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారని.. వారంతా పవన్ తో టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది. అయితే సరైన సమయం చూసి అంతా పార్టీలో చేరుతారని.. అది కూడా పొత్తులపై క్లారిటీ వచ్చిన తరువాతే..? వీరంతా జనసేనలో చేరే అవకాశం ఉంది అంటున్నారు.

Post a Comment

Previous Post Next Post