Trishul News

ఫేస్‌బుక్‌ డీపీ చూసి మోసపోయిన యువకుడు..!

విజయాపూర్, త్రిశూల్ న్యూస్ :
'మహానటి' సినిమాలో అలనాటి హీరోయిన్ సావిత్రి పాత్రలో నటించిన క్యూట్ హీరోయిన్' కీర్తి సురేష్' ఎవరికి తెలియదో చెప్పండి. తన నటనతో సినీ ప్రేక్షకుల మనసు దోచిన కీర్తి సురేష్ తన అందంతో కుర్రాళ్లకు కనువిందు చేస్తుంటది. కీర్తి సురేష్ స్వయంగా ఫేస్‌బుక్‌ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి చాటింగ్ చేయడం మొదలుపెడితే ఆ కుర్రాడి జీవితం ఎలా ఉంటుందో చెప్పండి. ఆ అబ్బాయికి అది కీర్తి సురేష్ ఫోటో అని తెలియకపోవడమే విచిత్రం. ఆమె ఫేస్‌బుక్ ఫోటోను చూసి ఆమెతో మరింత చాట్ చేయడం ప్రారంభించాడు. పెళ్లి దశకు కూడా వెళ్లేంత వరకు వీరి చాటింగ్ కొనసాగింది. ఇంతలో బిగ్ ట్విస్ట్ బయటికొచ్చింది. నటి కీర్తి సురేష్ ఫోటో తన ఫోటో అని నమ్మించి యువకుడిని మోసగించింది మహిళ. కర్ణాటక రాష్ట్రంలోని విజయపూర్ జిల్లా సిందగి తాలూకాలోని బగలూరు గ్రామానికి చెందిన పరశురామ అనే యువకుడు హైదరాబాద్‌లో భవన నిర్మాణ కార్మికులకు సూపర్‌వైజర్‌గా ఉద్యోగం చేస్తూ నెలకు రూ. 30 వేల జీతం తీసుకుంటున్నాడు. పరశురామకు ఫేస్ బుక్ లో హాసన్‌కు చెందిన మంజుల అనే ఇద్దరు పిల్లలు ఉన్న మహిళతో పరిచయం ఏర్పడింది. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే..మంజుల తన ఫేస్ బుక్ డీపీ దగ్గర తన ఫొటోకి బదులుగా కీర్తి సురేష్ ఫొటోని ఉంచింది. ఆమె ఫేస్ బుక్ డీపీని చూసి మైమరచిపోయాడు. అయితే అది హీరోయిన్ ఫొటో అని పరశురామకి తెలియదు. తనకు పరిచమైన అమ్మాయి హీరోయిన్ లా ఉందని పరశురామ తెగ మురిసిపోయేవాడు. గాల్లో తేలిపోతుండేవాడు. ఫేస్ బుక్ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ రోజూ చాటింగ్ లో మునిగితేలేవారు. ఈ క్రమంలో మంజుల తనకు చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయి,తాను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పడం ప్రారంభించింది. ఆమె మాటలకు కరిగిపోయాడు పరశురాయ. ఆమె చదువుల కోసం ఇంట్లో పొదుపు చేసిన ఐదు లక్షల నగదు, ప్లాట్‌తో సహా అన్నీ అమ్మేసి ఆమె చదువుకు డబ్బులు పంపేవాడు. ఫోన్ పే ద్వారా సుమారు 40 లక్షల వరకు డబ్బులు పంపినప్పటికీ అతడు ఆమెను కలవలేదు. ఎన్నిసార్లు కలుద్దామన్నా ఇప్పుడు కాదు అప్పుడు కాదు అంటూ తప్పించుకునేది మంజుల. ఏదో తేడా కొడుతుంది అని భావించిన పరశురామ తన డబ్బులు తనకు ఇచ్చేయాలని అడిగాడు. దీంతో మంజుల ఓ ఫ్లాన్ వేసింది. అదేంటంటే..ఓ రోజు పరశురామకి తన ఫేస్ కనబడకుండా వీడియో కాల్ చేసి మాట్లాడుతుండగా...నువ్వు నాతో మాట్లాడుతూ స్నానం చేయ్యి అని పరశురామకి చెప్పింది. దానికి పరశురామ సంతోషంతో గంతులేస్తూ స్నానం చేస్తూ వీడియో కాల్ మాట్లాడాడు. అయితే పరశురామ స్నానం చేస్తుండగా వీడియో కాల్ చేసి రికార్డు చేసింది మంజుల. ఆ తర్వాత ఆ వీడియో గురించి పరశురామకి తెలిపి.. బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించింది మంజుల. దీంతో మనస్తాపానికి గురైన పరశురామ నవంబర్ 15న సిందగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో మంజుల చేసిన మోసం గురించి పూర్తిగా వివరించాడు. ఆయన ఫిర్యాదు చేసిన కేసును సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ ఆనంద్‌కుమార్‌ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితురాలు మంజులను అదుపులోకి తీసుకున్నారు. ఆమె హాసన్ జిల్లా చన్నరాయపట్నం తాలూకా దాసరల్లి గ్రామం. పోలీసులు రావడంతో సమాచారం తెలుసుకున్న మంజుల భర్త పరారయ్యాడు. మంజులకు కూడా పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. పరశురామ నుంచి వసూలు చేసిన డబ్బుతో మంజుల.. 100 గ్రాముల బంగారం, హ్యుందాయ్ కారు, బైక్ కొనుగోలు చేసి పట్టణంలో ఇల్లు కూడా నిర్మిస్తోంది. ఈ మోసానికి మంజుల భర్త పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post