Trishul News

నేటి రాత్రి నుండి జిల్లాలో భారీ వర్షాలు నమోదు - తిరుపతి కలెక్టర్

- అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు కావాలి

- జాలర్లు ఈనెల 10 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్ళరాదు.

- పునరావాస కేంద్రాలు ఏర్పాటు కావాలి 

- ఏ ఒక్క మానవ, పశు నష్టం జరగడానికి వీలులేదు -  జిల్లా కలెక్టర్ 
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదు కానున్నాయని అధికారులు గ్రామ స్థాయిలో అందుబాటులో ఉండి సహాయక చర్యలు అందించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమావేశమై అన్ని మండలాల తహశీల్దార్లతో, ఎం.పి.డి.ఓ.లతో, స్పెషల్ ఆఫీసర్లతో జే.సి. డి.కె.బాలాజీ తో పాటు జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖతో మాట్లాడినప్పుడు ఉదయం వరకు తుఫాన్ దిశ మారలేదని తప్పనిసరిగా ఏపిలో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారని ఆ మేరకు మంగళవారం రాత్రి అధికారులకు టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించామని అన్నారు. ప్రధానంగా సముద్రతీర మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాలర్లు ఎట్టి పరిస్థితిలలో ఈ నెల 10 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్ళరాదని, నిన్న రాత్రి సమాచారం మేరకు 202 మంది జాలర్లు వేటకు వెళ్ళినట్లు తెలిసిందని అప్రమత్తం చేయడంతో 118 మంది తిరిగి వచ్చేశారని మరో 84 మంది నేటి మద్యాహ్నం లోపు చేరుకునే విధంగా ఆ గ్రామ ప్రజలకు తెలియజేయాలని అధికారులు అప్రమత్తంతో వ్యవహరించాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో రెవిన్యూ యంత్రాంగం అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పునరావాస కేంద్రాల ఏర్పాటు చేసి వసతి , ఆహారం, త్రాగునీరు వంటివి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని ముందస్తుగా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, ముసలివాళ్ళను తరలించేందుకు వాహనాలను సిద్ధం చేసుకుని ఉండాలని సూచించారు. సచివాలయ సిబ్బంది స్థానికంగానే 24 గంటలు అందుబాటులో ఉండాలని అన్నారు. పంచాయితీ రాజ్ మరియు ఆర్ అండ్ బి శాఖలు ప్రమాద చెరువులను, రహదారులను ముందుగానే గుర్తించి గస్తీ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయం కల్పించాలని ఎట్టిపరిస్థితిలలోనూ మనవ, పశు నష్టం జరగడానికి వీలు లేదని అన్నారు. పశువులను మేతకు బయటకు వెళ్ళకుండా చూసే విధంగా ఆదేశాలు ఇస్తూ అవసరమైన పశుగ్రాసం అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. ఇప్పటికే అన్ని రేషన్ షాపులకు నిత్యావసర వస్తువులను తరలించడం జరిగిందని ఎక్కడైనా పెండింగ్ ఉంటే నేటి సాయంత్రానికి అందజేయాల్సి ఉంటుందని, గ్యాస్, డీజల్ కొరత లేకుండా నిర్వహించే విధంగా సంబందిత ఏజేన్సీలకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. త్రాగు నీరు అందుబాటులో ఉండే విధంగా గ్రామీణ నీటి పారుదల శాఖ అన్ని ఓవర్ హెడ్ ట్యాంకులలో నీటి నిల్వ ఏర్పాటు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లా పంచాయితీ అధికారి నేటి సాయంత్రం కల్లా అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టి బ్లీచింగ్ మెటీరియల్ అందుబాటులో ఉంచాలని, అంటు రోగాలకు తావివ్వరాదని అన్నారు. జిల్లా వైద్య శాఖ అవసరమైన మందులను అన్ని సి.హెచ్.సి.లు, పి.హెచ్.సి.లు, విలేజ్ హెల్త్ క్లినిక్లలో అందుబాటులో ఉంచి పునరావాస కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. పాత పాఠశాలల భవనాలను, ఇళ్ళను పరిశీలించి ఏదైనా ప్రమాదాలకు అవకాశం ఉంటే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాల్సి ఉంటుందని అన్నారు. వర్షాల వల్ల జరిగే విద్యుత్ అంతరాయాన్ని నాలుగు గంటల లోపు పునరుద్ధరించే ఏర్పాట్లు చూడాలని అవసరమైన పోల్స్, కండక్టర్స్ అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట, గూడూరు రెవిన్యూ డివిజినల్ అధికారులు తమ పరిధిలో నిరంతర పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు. జేసి డి.కె.బాలాజీ మాట్లాడుతూ గత మూడు సార్లు హెచ్చరికలు జారీ చేసినా దేవుడు దయవల్ల ప్రమాదం తప్పిందని ప్రస్తుతం ఆ పరిస్థితి కనబడడం లేదని వాతావరణ శాఖ నుండి హెచ్చరికలు జారీ అవుతున్నాయని, సమాచార వ్యవస్థ దెబ్బతినకుండా ముందుగానే సర్వీస్ ప్రొవైడర్లకు సూచనలిచ్చి అన్ని టవర్స్ లలో ఉన్న జనరేటర్లు పనిచేసేలా డీజల్ బ్యాటరీలు చెక్ చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. రేషన్ కు సంబంధించి నిత్యావసర వస్తువులు నేటి సాయంత్రం లోపు అన్ని ప్రాంతాలకు చేరేలా చూడాలని అన్నారు. 2,3 రోజులు జిల్లా కలెక్టర్ స్థాయి నుండి క్రింది స్థాయి వరకు కష్టపడి విపత్తును ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని, చిన్న చిన్న వస్తువులని నిర్లక్ష్యం చేయకుండా రాత్రి సమయాలలో క్యాండిల్స్ వంటివి కూడా అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు. ఈ సమీక్షలో జిల్లా రెవిన్యూ అధికారి శ్రీనివాస రావు, జిల్లా అధికారులు ఆర్ అండ్ బి సుధాకర్ రెడ్డి, పంచాయితీ రాజ్ ఇంజనీర్ శంకర్ నారాయణ, పంచాయితీ అధికారి రాజశేఖర్ రెడ్డి, డివిజినల్ డెవలప్మెంట్ అధికారిణి సుశీలాదేవి, వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద రావు, పశు సంవర్థక శాఖ అధికారి వెంకటేశ్వరులు, జిల్లా ప్రణాళికా అధికారి అశోక్ కుమార్, ఎస్.ఈ వెల్ఫేర్ అధికారి చెన్నయ్య, బి.సి. వెల్ఫేర్ అధికారి యుగంధర్ తదితరులు పాల్గొనగా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా డివిజన్ స్థాయి అధికారులు, అన్ని మండలాల తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓ. లు, ఎస్.హెచ్.ఓ లు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. 

Post a Comment

Previous Post Next Post