Trishul News

నాగరికతకు పట్టుకొమ్మలు బీసీలు - సీఎం జగన్

విజయవాడ, త్రిశూల్ న్యూస్ :
నాగరికతకు పట్టుకొమ్మలు బీసీలు అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ జయహో బీసీ మహాసభలో ఆయన ప్రసంగించారు. బీసీలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. వార్డు మెంబర్ల దగ్గరి నుంచి తన కేబినెట్‌లోని మంత్రులకు, ఢిల్లీ వరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు స్వాగతం. నా బీసీ కుటుంబం జనసముద్రంలా నా ముందు ఉంది. మీ హృదయంలో జగన్‌.. నా హృదయంలో మీరు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాసులు కాదని.. బ్యాక్‌బోన్‌ క్లాసులు అని, వెనుకబాటు కులాలు కాదని.. వెన్నెముక కులాలు అని చాటిచెప్పే అడుగులు ఈ మూడున్నరేళ్ల కాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పడుతున్నాయి. బీసీ అంటే శ్రమ.. బీసీ అంటే పరిశ్రమ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయానికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉందని తెలిపారు. పారిశ్రామిక విప్లవం బీసీలను వెనక్కి నెట్టింది. ఆధునిక విద్య బీసీలను వెనకబాటుకు గురి చేసిందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు.. వెన్నెముక కులాలు చేస్తానని చెప్పాను. నేడు రాజ్యాధికారంలో వారిని భాగస్వాముల్ని చేశానని సీఎం జగన్‌ గుర్తు చేశారు. బీసీ కులాలన్నింటికీ మేలు చేస్తామని పాదయాత్రలో చెప్పాను. రాజ్యాధికారంలో బీసీలను భాగస్వామ్యం చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని మేం అమలు చేశాం. దేశంలోనే తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్‌ తెచ్చాం. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాం. మరోవైపు అమ్మ ఒడి, వైఎస్‌ఆర్‌ చేయూత పథకాల ద్వారా ఆదుకుంటున్నాం. చిరువ్యాపారులకు తోడుగా ఉండేందుకు జగనన్న చేదోడు పథకం తెచ్చాం. చేయూత పథకం కింద రూ.14,110 కోట్లు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం. తిరుమలలో సన్నిధి గోల్లలకు తలుపులు తెరిచే సంప్రదాయం కల్పించాం. బీసీలంటే ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, పనిముట్లు కాదు.. వెన్నెముక కులాలు అని మరోసారి సీఎం జగన్‌ ఉద్ఘాటించారు.

Post a Comment

Previous Post Next Post