Trishul News

ఏపీలో సలహాదారులపై హైకోర్టు ఆగ్రహం.. రాజ్యాంగబద్ధత తేలుస్తాం..!

అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారీ ఎత్తున సలహాదారుల్ని నియమిస్తూనే ఉంది. ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రులు, అధికారులు, శాఖలకు సలహాదారుల్ని నియమిస్తోంది. ఈ క్రమంలో విపక్షాలు తీవ్ర విమర్శలకు దిగుతున్నా ప్రభుత్వం పట్టించుకునే పరిస్దితి లేదు. ఈ నేపథ్యంలో ఓ ప్రభుత్వ శాఖకు నియమించిన సలహాదారు నియామకాన్ని సమర్ధించుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

సలహాదారుల వ్యవహారం..!

ఏపీలో ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ప్రభుత్వ శాఖలకు నియమిస్తున్న సలహాదారుల వ్యవహారం తాజాగా మరో మలుపు తిరిగింది. ఇప్పటికే సలహాదారుల నియామకం విషయంలో హైకోర్టు గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినా ప్రభుత్వం మాత్రం ముందుకే వెళుతోంది. ఇదే క్రమంలో తాజాగా దేవాదాయశాఖకు శ్రీకాంత్ అనే ఓ సలహాదారును నియమించింది. దీంతో ఆయన నియామకంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ప్రభుత్వ శాఖకు సలహాదారు నియామకం చెల్లదని స్టే ఇచ్చింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా మిగతా సలహాదారుల నియామకాలకూ చుట్టుకుంటోంది.

సీఎం, మంత్రులకు ఓకే కానీ..?

రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్న సలహాదారుల విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం జగన్, మంత్రులకు సలహాదారులను నియమిస్తే పర్వాలేదు కానీ ప్రభుత్వ శాఖలకు సలహాదారులేంటని ప్రశ్నించింది. ఇలాగే వదిలేస్తే రేపు కలెక్టర్, కమిషనర్లు, తహసీల్దార్లకు కూడా సలహాదారును నియమిస్తారేమో అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీఎం, మంత్రులకు నియమించే సలహాదారులతో, ప్రభుత్వ శాఖలకు నియమించే సలహాదారులను కలిపి చూడలేమని హైకోర్టు తెలిపింది.

హైకోర్టు అభ్యంతరాలివే..!

సలహాదారుల నియామకం విషయంలో హైకోర్టు పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వీరిని ఏ క్యాడర్ కింద నియమిస్తున్నారు, వీరికి జీతాలు ఏ బడ్జెట్ నుంచి ఇస్తున్నారని ప్రశ్నించింది. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు క్యాడర్ ఉంటుందని, అలాగే జీతభత్యాలు బడ్డెట్ నుంచి ఇస్తారని, కానీ దానికి విరుద్ధంగా వీరి నియామకాలు, జీతభత్యాల చెల్లింపులు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రజాధనం నుంచి వీరికి చెల్లింపులు చేయడానికి ఉన్న ప్రాతిపదిక ఏంటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే శారదా పీఠాధిపతి స్వరూపానంద సలహాతో దేవాదాయశాఖ సలహాదారును నియమించినట్లు ప్రభుత్వం చేసిన వాదనపై స్పందిస్తూ.. వారు ప్రభుత్వాలు ఎలా నడుపుతారని, వారు దేవాలయాలు నడిపేందుకు పరిమితమైతే మంచిదని తెలిపింది.

రాజ్యాంగ బద్ధత తేల్చనున్న హైకోర్టు.. ?

రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా సలహాదారుల్ని నియమించడం చిన్న విషయమేమీ కాదని హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులతో కూడిన ధర్మాసన వ్యాఖ్యానించింది. దేవాదాయశాఖ సలహాదారుగా నియమించిన శ్రీకాంత్ వ్యవహారంతో పాటు ఉద్యోగుల శాఖకు సలహాదారుగా నియమించిన చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారాన్ని కలిపి తేల్చేందుకు హైకోర్టు సిద్ధమవుతోంది. అలాగే సలహాదారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలేంటి, దాని రాజ్యాంగ బద్ధతను తేలుస్తామని హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఈ నెల 19కి విచారణను వాయిదా వేసింది.

Post a Comment

Previous Post Next Post