Trishul News

అతివేగం.. రెండు కుటుంబాలకు కన్నీరు మిగిల్చింది..!

- గోడను ఢీ కొన్న కారు.. ఇద్దురు యువకులు మృతి

- మరొకరికి తీవ్ర గాయాలు

- మరణంలోనూ వీడని స్నేహ బంధం
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
అతివేగం.. రెండు కుటుంబాలకు విషాదం మిగిల్చింది. చేతికి అందివచ్చిన కొడుకులను ఓ మంచి స్థాయిలో చూడాలని కలలు కన్న ఆ తల్లిదండ్రులుకు కన్నీటిని మిగిల్చారు. లా పూర్తి చేసి ఒకరు.. సచివాలయంలో ఉద్యోగం మరొకరిది. జీవితంపై ఎన్నో ఆశలతో కలలు కట్టుకున్న వారిరువురి జీవితాలను అతివేగం కబలించింది. ఆదివారం అర్ధ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృత్యువు ఒడిలోకి జారుకున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం - పలమనేరు జాతీయ రహదారిలో శాంతిపురం మండలం కడపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు గాయలతో బయటపడ్డాడు. స్థానికులు, రాళ్లబూదుగూరు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కుప్పం పట్టణానికి చెందిన ప్రముఖ లాయర్ నటరాజ్ కుమారుడు ఈశ్వర్ ఆదిత్య (సాకేత్)(32), రైల్వే రాధా కుమారుడు భరత్ (32), త్యాగరాజు (28) ముగ్గురు కాలక్షేపం కోసం ఆదివారం రాత్రి కుప్పం నుండి శాంతిపురం కారులో వచ్చి తిరిగి కుప్పంకు పయనమయ్యారు. మార్గమధ్యలోని కడపల్లె వద్ద కారు అదుపుతప్పి పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాకేత్, భరత్ లు అక్కడిక్కడే మృతి చెందగా త్యాగరాజు స్వల్ప గాయలతో బయటపడ్డాడు. కాగా సాకేత్ లా కోర్సు పూర్తి చేసి తండ్రి వద్దే ప్రాక్టీస్ చేస్తున్నాడు. భరత్ కుప్పం మండలం దళవాయికొత్తపల్లె సచివాలయంలో పని చేస్తున్నాడు. గాయపడిన త్యాగరాజు కూడా లాయర్ నటరాజ్ వద్దే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రమాద విషయం తెలుసుకున్న రాళ్లబూదుగూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన త్యాగారాజును చికిత్స నిమిత్తం 108 ద్వారా కుప్పం పిఈఎస్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

వారిది 25ఏళ్ల స్నేహ బంధం..!మృత్యువులోనూ వీడని స్నేహ బంధం..!
సాకేత్, భరత్ చిన్నప్పటి నుంచే స్నేహితులు. ఒకే స్కూల్లో చదువుకున్నారు. కాలేజ్ వచ్చే సరికి వేరు వేరు కాలేజీలో చేరిన కూడా వారి స్నేహం చెక్కచెదరలేదు. చదువు పరంగా వృత్తులు వేరైనా, తనువులు వేరైనా మనసు మాత్రం ఒక్కటే అలాంటి స్నేహ బంధాన్ని విడదీయడానికి మృత్యువు కూడా బయపడ్డదేమో..? అందుకే ఇద్దరినీ ఒకేసారి.. ఒకే ప్రమాదంలో మృత్యువు ఒడిలోకి చేర్చుకుంది. సాకేత్, భాస్కర్ స్నేహం గురించి ఇప్పుడు వారితో చదువుకున్న వారు గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యాంతమవుతున్నారు.
          చికిత్స పొందుతున్న త్యాగరాజు 

Post a Comment

Previous Post Next Post