Trishul News

151 మంది అమ్మాయిలకి తండ్రి లేని లోటు తీర్చాడు..!

సూరత్, త్రిశూల్ న్యూస్ :
మనం టెక్నికల్ యుగంలో ఉన్నాం.. ఎంతో ఎదిగిపోతున్నాం..అని సంబరపడిపోతున్నాం. మన ఆలోచనా విధానం కూడా ముందుకు వెళ్తోందని మురిసిపోతున్నాం. ఎంత ఎదిగినా ఆడపిల్లలపై జరుగుతున్న అమానుషాలకు మాత్రం అడ్డుకట్టపడట్లేదు. నిత్యం ఏదో ఒక చోట వారికి అన్యాయం జరుగుతూనే ఉంది. అలాంటి తరుణంలో 151 మంది ఆడపిల్లలకు తండ్రే అయ్యాడు ఓ వజ్రాల వ్యాపారి. కోట్లతో కులాసాగా ఉండక.. తండ్రి లేని ఆడపిల్లలకు పెళ్లి చేసి వారి జీవితాల్ని నిలబెట్టాడు. సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి మహేశ్ శావని ఆదివారం 151 జంటలకు పెళ్లి చేశారు. 2008లో మహేశ్ దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి తన ఇద్దరు కుమార్తెల పెళ్లికి కొన్ని రోజుల ముందు చనిపోయాడు. వెంటనే అతని బాధ్యతను తనపై వేసుకున్న మహేశ్ ఆ ఇద్దరు అమ్మాయిలకు వివాహం చేశారు. అప్పటి నుంచి ఏటా తండ్రిలేని నిరుపేద యువతులకు ఉచిత వివాహాలు చేయిస్తున్నారు. సూరత్ లో ఆదివారం జరిగిన పెళ్లికి ఆయన అక్షరాల 5 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. 151 జంటలు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయాయి. పెళ్లి కుమార్తెల కోసం ఖరీదైన బంగారు ఎంబ్రాయిడరీ చీరలు తెప్పించారు. ప్రతి వధువుకూ బంగారు నగలు, దుస్తులు, కలశం, ఓ పళ్లెం అందజేశారు. వివాహ వేదికను అందంగా అలంకరించారు. రుచికరమైన వంటలు వడ్డించారు. మూడురోజులపాటు జరిగిన ఈ వేడుకలకు లక్షమందికి పైగా అతిథులు విచ్చేశారు. ఏటా ఇలా నిరుపేద యువతులకు పెళ్లి చేసి పంపిస్తున్న వజ్రాల వ్యాపారి మంచి మనసును అందరూ అభినందిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post