Trishul News

విచ్చలవిడిగా ఆహార పదార్థాలు కల్తీ.. నిద్రావస్థలో యంత్రాంగం..!

త్రిశూల్ న్యూస్ డెస్క్ :
కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్‌లో రాజ్యమేలుతున్నాయి. తయారీదారులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఆయా ఆహార పదార్థాలపై తయారీ తేదీ, ఎంత కాలంలోగా వినియోగించాలనే వాటిని ముద్రించకుండానే విక్రయిస్తున్నారు. సుగంధ ద్రవ్యాలు, నెయ్యి, డాల్డా, పోపు గింజలు, మసాల దినుసులు, పొడులు, పసుపు, కారం, తదితర వస్తువులతోపాటు పచ్చళ్లు, తదితర వస్తువులను పాలిథిన్‌ ప్యాకెట్లలో ప్యాక్‌ చేసి హోల్‌సెల్‌, రిటైల్‌ షాపులకు సరఫరా చేస్తున్నారు. ఆయా షాపుల నుంచి దుకాణాల ద్వారా వినియోగదారులకు చేరుతున్నాయి. పాలల్లో డిటర్జంట్‌ పొడి, యూరియా, గంజి కలిపి కల్తీ చేస్తున్నారు. తేనెలో పంచదార, బెల్లం పాకం కలుపుతున్నారు. ఐస్‌క్రీంలో వాషింగ్‌ పౌడర్‌లు, పండ్లపై మైనంను పూతగా పూస్తున్నారు. ఉప్పులో సుద్దపొడి కల్తీగా వాడుతున్నారు. కల్తీ ఆహార పదార్థాల నివారణకు తూనికలు, కొలతలు, పౌర సరఫరాలు, కల్తీ నిరోధక శాఖ, విజిలెన్స్‌, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు.

కనీస నాణ్యత ప్రమాణాలు కరువు...!

ఆహార పదార్థాల తయారీలో ఉత్పత్తిదారులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఎండబెట్టిన బొప్పాయి గింజలను మిర్యాలుగా కనిపించేందుకు వ్యాక్‌ఆక్సైడ్‌ను కలిపి ఎండలో ఆరబెట్టి కల్తీ చేస్తున్నారు. పసుపులో తౌడు, టీపొడిలో రంపపు పొట్టుతోపాటు కారంపొడిలో కాల్చిన ఇటుకల పొడిని కల్తీగా వాడుతున్నారు. గసగసాల్లో గోధుమ రవ్వ, చెక్కరలో బియ్యం రవ్వను కలుపుతున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఆహార పదార్థాలను పాలిథిన్‌ కవర్లలో ప్యాక్‌ చేసి తయారీ, ఎక్స్‌పైరీ తేదీ, బ్యాచ్‌ నంబర్‌ ముద్రించకుండానే మార్కెట్‌లో విక్రయిస్తు న్నారు. ప్రజలు వాటిని కొనుగోలు చేసి వ్యాధుల బారిన పడుతున్నారు.

లైసెన్స్‌ లేకుండానే తయారీ..!

ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షించేందుకు ఆహార నాణ్యత, ప్రమాణాల చట్టం 2006ను అనుసరించి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్‌ సేఫ్టీ, స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) నియంత్రణ సంస్థను భారత ప్రభత్వం ఏర్పాటు చేసింది. ఎలాంటి ప్యాకేజీ ఆహార పదార్థాలను ఉత్పత్తి, మార్కెటింగ్‌ చేయాలన్నా సంస్థ నుంచి లైసెన్స్‌ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార తయారీదారులు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు లేకుండానే తయారు చేసి విక్రయిస్తున్నారు. వంట నూనెలు నియంత్రణ చట్టం 1947, నిత్యావసర సరుకుల చట్టం 1955, ఆహార కల్తీ నిరోధక చట్టం 1954 పాల ఉత్పత్తుల నియంత్రణ చట్టం 1992, తదితర చట్టాలు ఉన్నప్పటికీ కల్తీలను అరికట్టలేకపోతున్నారు.

అనారోగ్యాల బారిన పడుతున్న ప్రజలు..!

ఆహార కల్తీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ కాలం తీసుకోవడం శరీరానికి హానీకరం. కల్తీ ఆహార పదార్థాల్లో హానీకరమైన రంగులు, రసాయనాలు వాడడం వల్ల ప్రాణాంతక కేన్సర్‌కు కారణమవుతాయి. మరికొన్ని కల్తీ ఆహార పదార్థాల వల్ల గుండె, మూత్రపిండాలు, కాలేయం పాడై ప్రాణాంతకంగా మారుతాయి. కల్తీ వల్ల విరేచనాలు, కడుపునొప్పి, కీళ్ల నొప్పులు కలుగుతాయి. కొన్ని కల్తీ ఆహార పదార్థాల వల్ల మెదడు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కల్తీ ఆహార పదార్థాలను ఆకర్షణీయంగా, రుచిగా తయారు చేయడానికి ఎన్నో రసాయనాలను కలుపుతున్నారు. కల్తీ ఆహార పదార్థాల్లో అల్యూమినియం, పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల మెదడు, ఎము కలు దెబ్బతింటాయి. జీర్ణాశయం దెబ్బతిని అల్సర్‌కు కారణమవుతాయి. కల్తీ ఆహారం వల్ల చర్మంపై దద్దులు, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సిబ్బంది కొరత ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి, నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించడానికి ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్ల కొరత అధికంగా ఉంది. స్థానికంగా నెయ్యి, డాల్డా, వంట నూనెలు, మసాల పొడులు, పోపు గింజలు, అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, తదితర ఆహార పదార్ధాలను అనుమతి లేకుండా ప్యాకింగ్‌ చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారు. చిన్న చిన్న పరిమాణంలో రూ.5, రూ.10 ప్యాకెట్లను పట్టణ, గ్రామీణ పేద, మధ్య తరగతి ప్రజలకు విక్రయిస్తున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు వాటిని కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు. అనుమతులు లేని ప్యాకెజీ ఆహార పదార్థాలను విక్రయించడం వల్ల రిటైల్‌ షాపు నిర్వాహకులకు కూడా అధిక శాతం లాభం ఉండడంతో షాపుల నిర్వాహకులు వినియోగదారులకు కల్తీ ఆహార పదార్థాలనే అంటగడుతున్నారు. ప్రభుత్వ సంస్థల అనుమతి పొంది నిర్ణీత ప్రమాణాలు పాటించే బ్రాండెడ్‌ ఉత్పత్తిదారులు చిన్న సైజు ప్యాకెట్లను తయారు చేయకపోవడంతో కల్తీ వ్యాపారులకు వరంగా మారింది.

Post a Comment

Previous Post Next Post