Trishul News

వసుధైక కుటుంబం.. భవిష్యత్తు పదిలం - ఎమ్మెల్సి రామచంద్రయ్య

- జీ-20 కి భారత్ నేతృత్వం
                     వ్యాసకర్త 
                 సి. రామచంద్రయ్య
                శాసన మండలి సభ్యులు
               ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్

ప్రత్యేక వ్యాసం :
ఈ డిసెంబర్ 1 నుంచి జీ-20 దేశాల కూటమికి నాయకత్వం వహించే బాధ్యత భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ భుజస్కంధాలపై పడింది. ప్రపంచంలోని 20 అగ్రదేశాల కూటమికి భారత్ నేతృత్వం వహించే అవకాశం లభించడం గౌరవమేకాదు.. ఓ గొప్ప అవకాశం కూడా! 1999లో జీ-20 దేశాల కూటమి ఏర్పాటయింది. బలమైన ఆర్ధిక వ్యవస్థల్ని అనుసంధానించి పరస్పర సహకారం, ప్రోత్సాహంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నది కూటమి ప్రధాన లక్ష్యం. జీ-20 కూటమిలో 19 దేశాలతోపాటు యూరోపియన్ కూటమి భాగస్వామిగా ఉంది. కూటమి ఏర్పడింది 1999లో అయినా తొలి శిఖరాగ్ర సదస్సు జరిగింది మాత్రం 2008లో వాషింగ్టన్ డి.సి.లో. ఆ సమయంలోనే చోటుచేసుకొన్న 'ఆసియా ఆర్థిక సంక్షోభం' నుంచి బయటపడడానికి జీ-20 దేశాల కూటమి కృషి చేసింది. అప్పటి నుంచి అంతర్జాతీయ స్థాయిలో శక్తివంతమైన సంస్థలలో ఒకటిగా జీ-20 అవతరించింది. 2009లో జీ-8 కూటమిని రద్దుచేసి దానిస్థానంలో జీ-20 కూటమిని అవే లక్ష్యాలతో పని చేయించాలని సభ్య దేశాలు ఏకాభిప్రాయం తీసుకొన్నాయి.

2016లో చైనాలో జరిగిన జీ-20 కూటమి శిఖరాగ్ర సభలలో 'సమ్మిళిత ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ' కోసం కృషి చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత జీ-20 కూటమిలో సభ్యత్వం లేని దేశాలతో కూడా వర్తక, వాణిజ్య సంబంధాలు ముమ్మరం అయ్యాయి. గత ఏడెనిమిది సంవత్సరాలలో భారత్ 5వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించడంలో జీ-20 కూటమి దేశాలతో భారత్ నెరపిన దౌత్యపరమైన, వర్తక, వాణిజ్య సంబంధాలు కీలకంగా దోహదం చేశాయి.

చర్చలకే పరిమితమా..?

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే శిఖరాగ్ర సదస్సులలో తీసుకొనే నిర్ణయాల్ని సభ్య దేశాలు తు.చ. తప్పకుండా పాటించిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. వ్యవసాయం, వాణిజ్యం, వాతవరణం తదితర రంగాలలో సాధించే పురోభివృద్ధికి సంబంధించి ఏర్పరుచుకొన్న లక్ష్యాల సాధనలో ఎన్నడూ పూర్తిస్థాయిలో విజయం సాధించలేదు. అదేవిధంగా.. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో) తీసుకొన్న నిర్ణయాలు, గాట్ తదితర ఒప్పందాల్ని అమెరికాతోసహా పలు సంపన్న దేశాలు యదేచ్ఛగా ఉల్లంఘించాయి. పైగా, వాటి నిబంధనల్ని మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలు తప్పనిసరిగా పాటించేలా ఒత్తిడి తెచ్చాయి. ఈ నేపథ్యంలోనే జీ-20 కూటమికి నేతృత్వం వహించే అవకాశం భారత్ కు లభించినప్పటికీ.. ఏమేరకు విజయవంతం కాగలుగుతుంది? ఏర్పర్చుకొన్న లక్ష్యాలను సాధించడానికి ఆయా దేశాలపై భారత్ ఒత్తిడి తేగలదా? లేకుంటే ఇది కేవలం మొక్కుబడి నేతృత్వమేనా? అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నం అవుతున్నాయి. సాధారణంగా శిఖరాగ్ర సదస్సులు చర్చలకే పరిమితం తవుతాయి తప్ప కార్యాచరణలో పెద్దగా ఒరిగేదేమీ ఉండదన్న విమర్శలలో నిజం లేకపోలేదు.

ఇటీవల, ఉక్రెయిన్ రష్యా చేస్తున్న యుద్ధాన్ని విరమింపజేయడంలో అగ్రరాజ్యాలు విఫలం అయ్యాయి. రష్యాపై పలు ఆంక్షలు విధించినా భారత్ తన చమురు అవసరాల కోసం ఇప్పటికీ రష్యాపైనే ఆధారపడుతూ పెద్ద ఎత్తున చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిణామాలు దృష్ట్యా జీ-20 కూటమికి భారత్ నేతృత్వం వహించడం వల్ల ఒరిగేదేమిటన్న ప్రశ్నలు అనివార్యంగా ఎదురవుతున్నాయి. ఇండోనేషియా రాజధాని బాలిలో జరిగిన 2022 జీ-20 శిఖరాగ్ర సదస్సులో, ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా వైదొలగాలన్న పిలుపును కొన్ని దేశాలు గట్టిగానే విన్పించాయి. అంతకుముందే రష్యా అధినేత పుతిన్కు 'నేటి యుగం యుద్ధాలది కాదు' అంటూ భారత ప్రధాని నరేంద్రమోదీ ఎటువంటి శషబిషలు లేకుండా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడంతో భారత్ తన వాణిజ్య అవసరాల కోసం మాత్రమే రష్యాతో సంబంధాలు నెరపుతున్నదే తప్ప, ఆ దేశం ప్రదర్శిస్తున్న యుద్ధోన్మాదాన్ని ఏమాత్రం ఉపేక్షించడం లేదన్న సంకేతం బలంగానే వెళ్లింది. అంతేకాదు.. అంతర్జాతీయ సదస్సులలో చేసిన తీర్మానాలకు కట్టుబడటంలో భారత్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందన్న వాస్తవం కూడా తేటతెల్లం అయింది. ఉదాహరణకు క్యోటో ప్రోటోకాల్, పారిస్ కాప్-21, అంతకుముందు రియో, కోపెన్హెగన్ సదస్సులలో చేసిన తీర్మానాలకు అనుగుణమైన చర్యలు తీసుకోవడంతో పర్యావరణ పరిరక్షణ, భూతాప నియంత్రణలలో 63 దేశాల పనితీరుపై వెలువడ్డ నివేదికలో భారత్కు 8వ స్థానం లభించగా, చైనాకు 51, అమెరికాకు 52వ స్థానం లభించాయి. ఇటీవల కాలంలో గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోవడంతో చైనాతోసహా ప్రపచంలోని అనేక దేశాలలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్లు సంభవిస్తున్నాయి. భూతాపం పెరిగిపోతోంది. ఈ పరిణామాలన్నీ ఆయా దేశాల వ్యవసాయరంగంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకతలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. భారతదేశంలో కూడా వాతావరణ పరిస్థితులలో అనిశ్చితి కొనసాగుతోంది. ఏ ఒక్క దేశం తప్పు చేసినా.. ఆ ప్రభావం యావత్ ప్రపంచం మీద పడుతోంది. గ్రీన్ హౌస్ గ్యాస్లను భూతల పర్యావరణంలోకి ఇష్టానుసారంగా కొన్ని దేశాలు విడుదల చేస్తుండడంతో సముద్రతీర ప్రాంతాలకు ఆనుకొని ఉన్న దేశాలకు తరచుగా తుఫాన్లు, సునామీలు వంటివి సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. భారతదేశం తను అనాదిగా నమ్మే 'వసుధైక కుటుంబం' (ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం) అనే భావనను ముందుకు తెచ్చి పరస్పర సహకారం, భాగస్వామ్యం అత్యంత అవశ్యం అని చాటి చెబుతోంది. కలిసికట్టుగా సమస్యలను ఎదుర్కోనట్లయితే.. కుటుంబంలో ఎవరో ఒకరికి ఇబ్బంది కలుగుతుందని భారత్ చెప్పే మాట. కానీ, చైనా వంటి కొన్ని దేశాలు. 'నేను-నా దేశం' (గ్రూప్-జీరో) ముఖ్యం అనే ధోరణిలోనే సొంత ప్రయోజనాల కోసం ఇతర దేశాల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగాను, అంతిమంగా ప్రపంచమానవాళికి ముప్పు కలిగించేవిధంగా ముందుకు సాగుతున్నాయి.

జరిగే మేలు..!

జీ-20 కూటమికి నేతృత్వం వహించడం వల్ల భారత్ సమీప భవిష్యత్తులో కొన్ని సానుకూలతలు అందివస్తాయి. అందులో ప్రధానమైనది అంతర్జాతీయ ఉగ్రవాదానికి అందుతున్న ఆర్ధిక సాయాన్ని నిలిపివేయించగలగడం లేదా తగ్గించగలగడం, దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్, చైనా నుంచి అక్రమ చొరబాట్లు, ఆక్రమణలను నివారించడం, హిందూ మహా సముద్రంలో చైనా సైనిక పాటవ వ్యాప్తిని తగ్గించగలగడం; ముడిచమురు చౌకగా లభించే దేశాల నుండి దిగుమతి చేసుకోవడం, డిజిటల్ రంగంలో తను సాధించిన ప్రగతిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర దేశాలకు అందించడం, ఆహార భద్రత, పోషకాహార పంపిణీలకు సంబంధించి పేద దేశాలకు బాసటగా నిలవడం తదితర రంగాలలో భారత్ కీలకమైన పాత్ర పోషించబోతోంది. కోవిడ్ టీకాతో సహా వివిధ రకాల టీకాలను విస్తృతంగా అభివృద్ధి పరుస్తున్న భారత్ నుంచి సహాయ సహకారాలు ఆశిస్తున్న దేశాల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈ రంగంలో తాను సాధించిన ప్రగతిని ఆసియాలోని ఇతర దేశాలతోపాటు ఆఫ్రికా దేశాలతో పంచుకోవడంతో అంతర్జాతీయంగా భారత్ పేరు ప్రతిష్టలు గణనీయంగా పెరిగాయి. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ నివారణలో భారత్ పోషించిన పాత్ర, ఆ దేశానికి అందించిన ఆర్ధిక సాయం ఐక్యరాజ్యసమితి ప్రశంసలకు నోచుకొంది. పొరుగు దేశాలకు భారత్ స్నేహ హస్తం అందించడం ముందు నుంచి ఉంది. కాగా, ఆర్ధికరంగంలోనేకాక మొబైల్, డిజిటల్ సేవలు, ఔషధ రంగాలలో భారత్ వడివడిగా ముందుకు అడుగులేస్తోంది.

సాధిస్తున్న అభివృద్ధికి సమాంతరంగా పాత, కొత్త సవాళ్లు ఉమ్మడిగా భారత్ కు ఎదురవుతున్నాయి. 'ఇది యుద్ధాల శకం' కాదని నరేంద్రమోదీ రష్యా-ఉక్రెయిన్ల యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని వాఖ్యానించినప్పటికీ.. యుద్ధం అన్నది అనేక రూపాలలో భారత్న అస్థిరపరుస్తూనే ఉంది. తూర్పున అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలో చైనా దురాక్రమణ నిరాఘాటంగా జరుగుతూనే ఉంది. కశ్మీర్ బోర్డర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాలు చేస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం ఆగలేదు. ఇంకా, కంటికి కనిపించని సైబర్వార్, ఇన్ఫర్మేషన్వార్ మొదలైనవి ఎటూ ఉండనే ఉన్నాయి. వీటికితోడు వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే విపత్తులు, మానవాళి మనుగడను ప్రశ్నిస్తున్న కొత్తకొత్త వైరస్ల విజృంభణ తదితర సవాళ్లు ఉన్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమైన మార్గదర్శనం చేయాల్సిన అవసరం భారత్పై ఉంది.

ఎకానమీ విజన్..!

నూతన పదబంధాలను సృష్టించడంలో మన ప్రధాని నరేంద్రమోదీని మించిన వారెవరున్నారు? జీ-20 దేశాల కూటమికి నేతృత్వం వహించే అరుదైన గౌరవం దక్కించుకొన్న నరేంద్రమోదీ సృష్టించిన పదబంధమే 'ఎకానమీ విజన్'. జీ-20 కూటమి దేశాల మధ్య పరస్పర అనుసంధానత, బాధ్యతల భాగస్వామ్య విధానమే ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘ఎకానమీ విజన్ విధానం. 'నేను-నా దేశం' (గ్రౌండ్ జీరో) అనే విధానానికి పూర్తిగా విరుద్ధమైనదే ఇది. ప్రపంచం అంతా ఒకే భూమి. ప్రపంచ జనాభా అంతా ఒకటే కుటుంబం. ఒకప్పుడు దీనిని 'యుటోపియన్ థియరీ'గా అభివర్ణించేవారు. 'అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి' అనే భారత ప్రాచీన ధర్మాలు, విధానాలతో నరేంద్రమోదీ జీ-20 దేశాల కూటమికి దిశానిర్దేశం చేయనున్నారు. భూమిని మాతృమూర్తిగా భావించి దానిని సంరక్షించుకోవడం కూడా ఇందులో భాగమే. ముఖ్యంగా, శిలాజల ఇంథనాల వాడకాన్ని నిరోధించి హరిత ఇంధనాలను పెద్దఎత్తున వినియోగంలోకి తీసుకురావడం, సూర్యరశ్మి (సోలార్ ఎనర్జీ) ని విరివిగా ఉపయోగించుకోవడం, పవన విద్యుత్ వినియోగం పెంచడం మొదలైన చర్యల ద్వారా పటిష్ట కార్యాచరణకు ప్రధాని నరేంద్రమోదీ సమాయత్తం అవుతున్నారు. దృఢ నిర్ణయాల దురంధరుడిగా పేరుపడిన ప్రధాని నరేంద్రమోదీ తన నాయకత్వ పటిమను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించే ఓ మహత్తర అవకాశం నేడు లభించింది. గతంలో ప్రధానమంత్రులుగా పనిచేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రు, శ్రీమతి ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయిలకు ఏవిధంగానైతే వారి విశిష్ట నాయకత్వానికి వివిధ సందర్భాలలో అంతర్జాతీయ ఖ్యాతి లభించిందో అలాగే నేడు ప్రధాని నరేంద్రమోదీకి జీ-20 దేశాల నాయకత్వం అందివచ్చిన ఓ చక్కటి అవకాశం. దానిని ఆయన ఫలప్రదం చేసి దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేస్తారని ఆశించవచ్చు.
         సి. రామచంద్రయ్య
       శాసన మండలి సభ్యులు
      ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్

Post a Comment

Previous Post Next Post