Trishul News

తెల్లారితే పెళ్లి.. అంతలోనే జీవితాలు తెల్లారిపోయింది..!

చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
తెల్లారితే పెళ్లి. పెళ్లికుమారుడు, అతడి కుటుంబీకులు, బంధువులు ముందు రోజు రాత్రి పెళ్లికుమార్తె ఇంటికి ట్రాక్టరులో బయల్దేరారు. మరో ఆరు కిలోమీటర్లు వెళ్తే ఆ ఇంటికి చేరుకోవచ్చు. అంతలోనే ట్రాక్టరు బోల్తా పడింది. అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందగా, పెళ్లికుమారుడు సహా 20 మందికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు, బాధితులు తెలిపిన ప్రకారం.. ఐరాల మండలం బలిజపల్లెకు చెందిన హేమంత్‌కు.. పూతలపట్టు మండలం జెట్టిపల్లెకు చెందిన భువనేశ్వరితో గురువారం తెల్లవారుజామున వివాహం జరగనుంది. వధువు ఊర్లోని శ్రీకృష్ణ ఆలయం వద్ద వివాహ వేదిక ఏర్పాటు చేశారు. దీనికిగాను బలిజపల్లె ఎస్సీ కాలనీ నుంచి 26 మందితో కూడిన బృందం బుధవారం రాత్రి ట్రాక్టరులో బయల్దేరింది. దాదాపు పది కిలోమీటర్లు వెళ్లగానే.. 9.30 గంటల సమయంలో పూతలపట్టు మండలం లక్ష్మయ్యఊరు సమీపంలోకి ట్రాక్టరు చేరింది. వేగంగా వెళ్లే క్రమంలో అదుపు తప్పి రోడ్డు పక్కన 20 అడుగుల లోతులో బోల్తా పడింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లికుమారుడు సహా 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ప్రమాదం జరిగిందిలా..!

లక్ష్మయ్య వూరు వద్ద, అటవీ ప్రాంతంలో రోడ్డు డౌన్‌గా ఉంది. డీజిల్‌ ఆదా అవుతుందని అక్కడ డ్రైవరు సురేందర్‌రెడ్డి క్లచ్‌ వదిలేయడంతో వేగంగా వెళుతూ అదుపు తప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో రోడ్డు పక్కన గుంతలో 20 అడుగుల లోతులో ట్రాక్టరు పడిపోయింది. కాగా, డ్రైవరు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అందుకనే అదుపు చేయలేకపోయినట్లు సమాచారం. క్షతగాత్రులు ఫోన్లు చేసి బంధువులకు ప్రమాదం గురించి చెప్పగా, వాళ్లు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు ప్రమాద స్థలికి బయలుదేరారు. అదే సమయంలో పోలీసులు వావిల్‌తోటకు చెందిన వైసీపీ నేత శ్రీకాంత్‌రెడ్డికి పోలీసులు ఫోను చేసి క్రేన్‌ తెప్పించారు. దీని సాయంతో మృతదేహాలను వెలుపలకు తీశారు. మృతులు ఐరాల మండలం మోటకంపల్లెకు చెందిన ట్రాక్టరు డ్రైవరు సురేందర్‌రెడ్డి (51), బలిజపల్లెకు చెందిన పెళ్లికుమారుడి పెద్దమ్మ వసంత (45), చిత్తూరు సమీపం మురకంబట్టుకు చెందిన రెడ్డమ్మ (31), ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్న బలిజపల్లెకు చెందిన తేజ (25), ఆమె ఇద్దరు పిల్లలు దినేష్‌ (4), దేషిక (2) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో వల్లేయమ్మ, సోమశేఖర్‌, లక్ష్మమ్మ, చిన్నపాప, మునీశ్వరి, సుభాషిణి, అరుణ, లీలావతి, మాలతి, యశోద, నవీన, శంకరయ్య, హేమంత్‌ (పెళ్లికొడుకు), వినాయక, సుమతి, మణి, కాంతమ్మ, అన్నపూర్ణ, శోభన్‌బాబు. వీరు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండగా.. కృష్ణవేణి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి స్విమ్స్‌కు రెఫర్‌ చేశారు.

మెరుగైన వైద్యసేవలకు కలెక్టర్ ఆదేశాలు 
బుధవారం రాత్రి పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన నేపథ్యంలో చిత్తూరు జిల్లాప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షత గాత్రులను పరా మర్శించిన జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్, ఎస్పీ వై. రిశాంత్ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంక టేశ్వర్. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని అధికారులను ఆదేశించారు.

Post a Comment

Previous Post Next Post