Trishul News

చంద్రబాబు సభలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురు మృతి..!

- మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం
- బాధితులను పరామర్శించిన చంద్రబాబు
కందుకూరు, త్రిశూల్ న్యూస్ :
టిడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ షో ప్రాంగణంలో తీవ్ర అపశృతి తలెత్తింది. నెల్లూరు జిల్లాలో ఇదేం కర్మరా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు కందుకూరులో రోడ్ షోలో పాల్గొన్నారు. అయితే ఈ రోడ్ షోకు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు ప్రసంగం మొదలైన కొద్దిసేపటికే గందరగోళం నెలకొంది. సభలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో గుండంకట్ట ఔట్‌లెట్‌లో కార్యకర్తలు జారిపడిపోయారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొందరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్నాకే ప్రసంగం చేస్తానంటూ కార్యక్రమాన్ని నిలిపేసి చంద్రబాబు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కాగా తొక్కసలాటలో కార్యకర్తల మరణం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన చంద్రబాబు.. అనంతరం రోడ్ షో ప్రాంగణానికి వచ్చారు. పార్టీ కార్యకర్తల మరణం తీరని విషాదంగా అభివర్ణించిన చంద్రబాబు.. విధిని ఎవరూ తప్పించలేరని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడబోనని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని.. వారి పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రేపు టీడీపీ నేతలు, కార్యకర్తలంతా కలిసి చనిపోయిన వారి అంత్యక్రియల్లో పాల్గొంటారని తెలిపారు. అదే సమయంలో వారికి తక్షణ సాయం కూడా అందిస్తామని తెలిపారు. రోడ్ షో ప్రాంగణంలోనే చనిపోయిన వారికి సంతాప సూచికంగా రెండు నిమిషాలు మౌనం పాటించిన చంద్రబాబు.. అనంతరం కందుకూరు నుంచి బయలుదేరి వెళ్లారు. ఇక చనిపోయిన వారిని దేవినేని రవీంద్రబాబు, కలవకూరి యానాది, యాటగిరి విజయ, కాకుమాని రాజా, మరలపాటి చినకొండయ్య, పురషోత్తంగా గుర్తించారు. 

Post a Comment

Previous Post Next Post