Trishul News

శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్.. వసతి గృహల అద్దె భారీగా పెంపు..!

తిరుమల, త్రిశూల్ న్యూస్ :
తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక వర్గం షాక్ ఇచ్చింది. భక్తులకు కేటాయించే కొన్ని వసతి గృహాల అద్దెను భారీగా పెంచింది. ఈ మధ్య కాలంలో వసతి గృహాలను టీటీడీ ఆధునీకరించింది. ఇప్పుడు ఆధునీకరణ కారణంగా అద్దెను పెంచి వసూళ్లు చేస్తోంది. సామాన్య..మధ్యతరగతి ప్రజలకు ఇది షాకింగ్ గా మారుతోంది. తిరుమల వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాల కోసం ఆధునీకరించారు. ఇందుకోసం రూ 100 కోట్లతో టెండర్లను ఆహ్వానించారు. పనులు ప్రారంభించారు. కొన్ని చోట్ల పనులు పూర్తయ్యాయి. ఆధునీకరణ పూర్తయిన వసతి గృహాల్లో ధరలు పెంచారు.

రూ. 500 నుంచి రూ. 1000కి పెంపు

తిరుమలలో భక్తుల కోసం దాదాపుగా 6000 గదులు ఉన్నాయి. తిరుమలల నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల్లో అద్దెను పెంచి వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వసతి గృహాల్లో రూ 500, రూ 600 గా ఉన్న అద్దెను రూ 1000కి పెంచారు. ఈ నెల 1వ తేదీ నుంచి నారాయణ గిరి రెస్ట్ హౌస్లోని 1,2,3 గదులను రూ 150 నుంచి జీఎస్టీతో కలిపి రూ 1700 కి పెంచారు. నారాయణగిరి రెస్ట్ హౌస్ 4లో ఒక్కో గదిని ర 750 నుంచి రూ 1750కి పెంచేసారు. కార్నర్ సూట్ ను జీఎస్టీతో కలిపి రూ 200 కు పెంచారు. స్పెషల్ టైపు కాటేజీల్లో రూ 750 ఉన్న గది అద్దెను జీఎస్టీతో కలిపి రూ 2800 చేశారు.

అద్దెతో పాటు డిపాజిట్ చెల్లింపు
భక్తులు గదుల అద్దెతో పాటుగా డిపాజిట్ ను అంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం కారణంగా గది అద్దెకు రూ 1700 అయితే, డిపాజిట్ నగదుతో కలిపి రూ 3400 చెల్లించాల్సి ఉంటుంది. వసతి గృహాల ధరలను పెంచుతూ టీటీడీ తీసుకున్న నిర్ణయం సామాన్య భక్తులకు భారంగా మారుతోంది. ఎంత ఖర్చు చేస్తే అంత తిరిగి భక్తుల నుంచే వసూలు చేయాలనే విధంగా.. ఇప్పుడు వసతి గృహాల కోసం చేసిన ఖర్చును పెంచిన ధరల నుంచి వసూలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ధరల పెంపు పైన పునరాలోచించాలని భక్తులు కోరుతున్నారు.

ఆ వసతి గృహాల్లోనూ పెంచుతారా..!
సామాన్య భక్తులు ఎక్కువగా వసతి కోసం వినియోగించే వసతి గృహాల్లోనూ ఇప్పుడు మరమ్మత్తులు జరుగుతున్నాయి. రూ 50కే వసతి దొరికే ఎస్ఎంసీ, ఎస్ఎన్సీ, హెచ్ వీసీ అదే విధంగా రూ 100 అద్దెతో అందుబాటులో ఉన్న రాం భగీచా, వరాహస్వామి గెస్ట్ హౌస్, ఏటీసీ, టీబీసీ, సప్తగిరి అతిధి గృహాల్లోనూ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. వీటన్నింటిలోనూ ఈ పనులు పూర్తి చేసిన తరువాత ఇతర వసతి గృహాల్లో పెంచిన విధంగానే ఇక్కడా వసతి గదుల అద్దె పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post