Trishul News

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

- పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏడాదిన్నరగా జీతాలు కూడా చెల్లించలేదా?

- ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఆందోళన కలిగిస్తోంది

- బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లకు పనులు ఎలా అప్పగించారు?

- అలాంటి కాంట్రాక్టర్లకు బిల్లులు ఏ మేరకు చెల్లించారో నివేదిక ఇవ్వండి

- గ్రామాలవారీగా చేపట్టిన పనుల వివరాలు స్థానిక ప్రజలకు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలి

- పి.ఆర్. అండ్ ఆర్డీ, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఇంజినీరింగ్ విభాగాల సమీక్షలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ 
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
డేటా ఎంట్రీ ఆపరేటర్లు లాంటి చిరుద్యోగులకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం మూలంగా ఆ చిన్నపాటి ఉద్యోగుల కుటుంబాలు వేదనతో ఉన్నాయి.. ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పి.ఆర్. అండ్ ఆర్డీ, ఆర్.డబ్ల్యూ.ఎస్., పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కచ్చితంగా ప్రతి శాఖలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపుపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. గురువారం ఉదయం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పి.ఆర్. అండ్ ఆర్డీ, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఇంజినీరింగ్ విభాగాల సమీక్ష నిర్వహించారు. 
సమీక్ష సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రివర్యులు బయలుదేరగా క్యాంపు కార్యాలయం వెలుపల వేచి ఉన్నవారిని చూసి వాహనం నిలిపారు. పి.ఆర్. ఇంజినీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పని చేస్తున్న మహిళలు తమకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు రావలసిన జీతాలు చెల్లించే ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరారు. ఈ విధంగా బాధపడుతున్నవారు 129మంది ఉన్నామని, పిల్లల చదువులు, కుటుంబ సభ్యుల ఆరోగ్య ఖర్చులకు కూడా ఇబ్బందులుపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘శాఖాపరమైన సమీక్షలు మొదలుపెట్టి, వివిధ పథకాల అమలు, నిధుల వినియోగంపై నివేదికలు పరిశీలిస్తున్నాము. కచ్చితంగా ఈ అంశాన్ని చర్చిస్తాము’ అన్నారు. సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఇంజినీరింగ్ విభాగం మొదలుపెట్టిన రోడ్లు, వంతెనల పనులు, వాటికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బంక్ (ఏఐఐబీ) నుంచి సమీకరించిన రుణం.. వాటి వినియోగంపై కూలంకషంగా చర్చించారు. ప్రధానంగా కేంద్రం అమలు చేసే పి.ఎం.జి.ఎస్.వై., ఆర్.సి.పి.డబ్ల్యూ.ఈ., ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాల ద్వారా వచ్చిన నిధులు ఏ మేరకు వినియోగించారో చర్చించారు. పెండింగ్ లో ఉన్న పనులు, అందుకు కారణాలను తెలిపే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రహదారులు పాడైపోయిన తీరుపై చర్చించారు. ఏ మేరకు దెబ్బ తిన్నాయో, ఎంత కాలం నుంచి మరమ్మతులు చేయడం లేదో చెబుతూ, రోడ్ల కోసం కేటాయించిన నిధులను ఏం చేశారో తెలుపుతూ నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏఐఐబీ నుంచి వచ్చిన రుణాన్ని వినియోగించుకోవడంలోనూ గత ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారులు వేస్తే ఆ మొత్తాన్ని రీ ఎంబర్స్ చేస్తామని ఏఐఐబీ చెప్పిందని తెలిసి ఉప ముఖ్యమంత్రివర్యులు ఆశ్చర్యపోయారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం చేపట్టే పనులను సకాలంలో పూర్తి చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా, నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడుతున్నారా లేదా అని ప్రశ్నించారు. బ్లాక్ లిస్టులో ఉన్నవారికి ఏ విధంగా పనులు అప్పగిస్తున్నారు, ఆ జాబితాలో ఉన్నవారికి బిల్లులు చెల్లింపులు ఎలా చేశారో తెలుపుతూ వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. నాణ్యతా ప్రమాణాలు పరిశీలనకు క్వాలిటీ విభాగాన్ని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ నిధులతో ఏ ప్రాంతంలో ఏ పని చేస్తున్నామో, అందుకు సంబంధించి అనుసరించాల్సిన నాణ్యతా ప్రమాణాలు, బడ్జెట్ వివరాలు ప్రజలకు తెలియచేలా బోర్డులు పెట్టాలనే నిబంధన ఉన్నా ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. కచ్చితంగా ఆ బోర్డులు ఏర్పాటు చేయాలని, శాఖ చేసే పనుల వివరాలు స్థానికులకు తెలియచేయాల”ని ఆదేశించారు. ఈ సమావేశంలో పి.ఆర్. అండ్ ఆర్.డి. ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ ఈ.ఎన్.సీ. బాలు నాయక్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post