తిరుపతిలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

December 18, 2025

తిరుపతిలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ..!


తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
విద్యావంతులైన పిల్లలే సమాజానికి, సంస్కృతికి నిజమైన సంపద. ఆధునిక విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడం సాధ్యమవుతుంది అని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మహిళా అధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ డి. సాయి సజాత పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మహిళా అధ్యయన కేంద్రం, విస్తరణ కేంద్రం మరియు తిరుపతికి చెందిన ప్రగతి స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి సిబ్బందికి "బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్ (BCC) మరియు కౌన్సిలింగ్ మెళకువలు" అనే అంశంపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రొఫెసర్ డి. సాయి సజాత మాట్లాడుతూ సమాజంలో ఒక్క బిడ్డ కూడా బడికి దూరం కాకూడదని, ఏ బాల్యమూ పనిలో మాడిపోకూడదని ఆమె ఆకాంక్షించారు. క్షేత్రస్థాయిలో ప్రవర్తనా మార్పును ఎలా తీసుకురావాలో వివరిస్తూ, కమ్యూనికేషన్ మరియు కౌన్సిలింగ్ పద్ధతులపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రగతి ఎన్జీవో అధ్యక్షులు రమణ మాట్లాడుతూ బాల్య వివాహాలు మరియు బాలకార్మిక వ్యవస్థ వంటి సామాజిక రుగ్మతలను కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందన్నారు. వీటి నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ ఉమ్మడిగా పోరాడాలని పిలుపునిచ్చారు. విన్స్ ఎన్జీవో  డైరెక్టర్ ఆర్. మీరా మాట్లాడుతూ క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం తల్లిదండ్రుల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సూచించారు. వారి ఆలోచనా విధానంలో మార్పు తెచ్చినప్పుడే దురాచారాలను రూపుమాపడం సులభతరమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ శిక్షణా కార్యక్రమంలో క్షేత్రస్థాయి సిబ్బందికి కౌన్సిలింగ్ నిర్వహించేటప్పుడు అనుసరించాల్సిన ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు. బాలల రక్షణ మరియు విద్యా హక్కుల అమలులో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో చర్చించారు. ఈ కార్యక్రమంలో మాస్ సంస్థ డైరెక్టర్ బి. సునంద, ప్రగతి సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కె.నారాయణ, మహిళా అధ్యయన కేంద్రం అకాడమిక్ కన్సల్టెంట్స్ డాక్టర్ రమణ, డాక్టర్ రాజరాజేశ్వరి, డాక్టర్ సునీత, ప్రగతి ఎన్జీవో క్షేత్రస్థాయి సిబ్బంది మరియు సహాయ సిబ్బంది వరలక్ష్మి, ఉమాదేవి, భానుమతి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages