శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్.. సాటిలేని, అసమాన, అపరాజిత నటనాప్రతిభ..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

May 27, 2026

శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్.. సాటిలేని, అసమాన, అపరాజిత నటనాప్రతిభ..!

అమరావతి, త్రిశూల్ న్యూస్ :
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికతలతో మహాకావ్యాలైన రామాయణం మరియు మహాభారతం అవిభాజ్యంగా మిళితమై ఉన్నాయి. ఈ అమర ఇతిహాసాల పాత్రలు తరతరాలుగా భారతీయుల ఆరాధనకు పాత్రమవుతూ ప్రతి ఇంటి జీవనంలో విడదీయరాని భాగాలుగా నిలిచాయి. ఈ మహాకావ్యాల ప్రధాన పాత్రలు, రామాయణంలోని శ్రీరాముడు మరియు మహాభారతంలోని శ్రీకృష్ణుడు,
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకరైన మహావిష్ణువు అవతారాలుగా భావించబడుతారు. 1950, 1960 దశకాల్లోని తెలుగు సినీ స్వర్ణయుగంలో ఈ ఇతిహాసాల అనేక ఉపకథలను, అపూర్వ పాత్రలను వెండితెరకు తీసుకువచ్చిన ఘనత తెలుగు చిత్రసీమకు దక్కింది. ఆ మహనీయ పాత్రలకు శాశ్వత జీవం పోసిన నటుల్లో ఎన్టీఆర్ అగ్రగణ్యుడు. ఎన్టీఆర్ రామాయణంలో శ్రీరాముడు, వాల్మీకి, ప్రతినాయకుడు రావణాసురుడు, అతని కుమారుడు ఇంద్రజిత్ పాత్రలను పోషించారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు, భీష్ముడు, భీమసేనుడు, అర్జునుడు, బృహన్నల, ప్రతినాయకుడు దుర్యోధనుడు, అతని ఆత్మీయ మిత్రుడు కర్ణుడు, కీచకుడు వంటి పాత్రలను అద్భుతంగా ఆవిష్కరించారు. అదేవిధంగా నలకూబరుడు, యమధర్మరాజు, సత్యహరిశ్చంద్రుడు, సత్యనారాయణస్వామి, దుష్యంత మహారాజు, విశ్వామిత్రుడు, మహావిష్ణువు, పరమశివుడు, పరశురాముడు, నరహరి తదితర అనేకానేక పౌరాణిక పాత్రలను తన 33 సంవత్సరాల విశిష్ట సినీ ప్రస్థానంలో పోషించారు. ఇంత విస్తృతమైన పౌరాణిక పాత్రలను, నాయక పాత్రలతో పాటు ప్రతినాయక పాత్రలను కూడా అంతటి అధికారంతో, ఆత్మవిశ్వాసంతో పోషించిన నటుడు ప్రపంచంలోనే మరొకరు లేరనడం అతిశయోక్తి కాదు. ఈ పాత్రలన్నింటిలో శ్రీకృష్ణుడి పాత్రకు తెలుగు ప్రజల హృదయాల్లో, తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరుపెళ్ళాలు(1954) / మయాబజార్ (1957) తో ప్రారంభమై శ్రీమద్విరాటపర్వం (1979) వరకు ఎన్టీఆర్ ఇరవైకి పైగా చిత్రాల్లో శ్రీకృష్ణుడిగా నటించారు. వీటిలో శ్రీకృష్ణుడి జీవితంలోని వివిధ ఘట్టాలపై నిర్మితమైన పూర్తి స్థాయి పౌరాణిక చిత్రాలతో పాటు ఇతర చిత్రాల్లో ధరించిన ప్రత్యేక పాత్రలూ ఉన్నాయి. శ్రీకృష్ణుడి పాత్రను ఆయన అంతగా ఆవహించుకున్నారు కాబట్టి తెలుగు ప్రజల దృష్టిలో “ఎన్టీఆర్ అంటే కృష్ణుడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్” అన్న భావన స్థిరపడిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా రాకముందు కాలంలో శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ క్యాలెండర్లు ఆంధ్రప్రదేశ్ అంతటా అనేక ఇళ్లను అలంకరించేవి. అన్నగారి శ్రీకృష్ణుడి ప్రజాదరణ తెలుగు చిత్రసీమను దాటి తమిళ చిత్రసీమలోనూ విస్తరించి, అక్కడి ప్రేక్షకులను కూడా ఆయన మంత్ర ముగ్ధులను చేశారు. భారతీయ పురాణాల్లో శ్రీకృష్ణుడి పాత్రకు అపూర్వమైన ప్రత్యేకత ఉంది. కృష్ణుడు తెలివైనవాడు, అందగాడు, ఆకర్షణీయుడు, జ్ఞాని, చిలిపివాడు, అల్లరి స్వభావం గలవాడు, రొమాంటిక్, దౌత్యనిపుణుడు, అన్నిటికంటే గొప్ప తత్వవేత్తగా చిత్రించబడ్డాడు. ఇంత విభిన్నమైన గుణాల సమ్మేళనంతో రచించబడిన మరొక పౌరాణిక పాత్ర దొరకడం కష్టం. ఒక నటుడిగా ఎన్టీఆర్ సాధించిన అత్యున్నత విజయాల్లో ఒకటి, శ్రీకృష్ణుడిని జీవితంలోని భిన్న దశల్లో అద్భుతమైన వైవిధ్యంతో ఆవిష్కరించడం. మాయాబజార్లో కేవలం 33 ఏళ్ల వయసులోనే శాంత స్వభావం, పరిణతి, గాంభీర్యం కలిగిన శ్రీకృష్ణుడిగా నటించి, క్లిష్ట పరిస్థితుల్లో శశిరేఖ వివాహాన్ని సాఫల్యం చేకూర్చే పాత్రలో విశ్వసనీయంగా మెప్పించారు. వయస్సు పెరిగిన తరువాత యువకృష్ణుడిగా చిలిపితనం, రొమాన్స్, అల్లరి, లావణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తూ కథానాయికలతో యుగళగీతాలు పాడుతూ అలరించారు. ఇంతటి వైవిధ్యం ఏ నటుడికైనా అరుదైన ఘనత. ఒకే పౌరాణిక పాత్ర అయిన శ్రీకృష్ణుడిని ఇరవైకి పైగా చిత్రాల్లో పోషించి, పాతిక సంవత్సరాలకు పైగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఎన్టీఆర్ సృష్టించిన ప్రపంచ రికార్డే. ఈ రోజుకీ చలనచిత్ర మాధ్యమం ద్వారా తెరపై శ్రీకృష్ణుడి
పాత్రకు అమరత్వం ప్రసాదిస్తూ, తానే ఒక లెజెండ్‌గా నిలిచిపోయిన మహానటుడు ఎన్ టీఆర్ కి మన హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాం.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages