కాపురానికి వెళ్ళనన్న కూతురు - కొట్టి చంపిన తండ్రి

- దాడిలో అడ్డు వచ్చిన భార్య మృతి 
మహబూబ్‌నగర్‌, త్రిశూల్ న్యూస్ : 
కాపురానికి వెళ్లనని చెప్పిన నవవధువును తండ్రి కొట్టి చంపాడు. కుమార్తెను కొడుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన భార్యను కూడా రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం నిందితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జైనల్లీపూర్‌ గ్రామానికి చెందిన కృష్ణయ్య, కలమ్మ భార్యాభర్తలు. ఈ దంపతుల కుమార్తె సరస్వతి (22)ని మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన యువకుడికి ఇచ్చి మే 8న వివాహం జరిపించారు. పెళ్లి జరిగిన 10 రోజుల తర్వాత నవవధువు ఇంటికొచ్చింది. ఆ తర్వాత అత్తారింటికి వెళ్లబోనని తల్లిదండ్రులకు చెప్పింది. కాపురానికి వెళ్లాల్సిందేనని కుమార్తెను తండ్రి కృష్ణయ్య మందలించాడు. కానీ, ఏం కష్టమొచ్చిందో ఏమో గానీ.. అత్తారింటికి వెళ్లేందుకు ఆ అమ్మాయి నిరాకరించింది. ఆమెకు తల్లి కూడా మద్దతుగా నిలిచింది. ఈ విషయంపై మంగళవారం ఉదయం ఆ కుటుంబంలో మరోసారి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన కృష్ణయ్య.. కుమార్తె సరస్వతిపై రోకలి బండతో దాడి చేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన భార్య కలమ్మను కూడా రోకలిబండతో తీవ్రంగా కొట్టాడు. అనంతరం అతడు రసాయన గుళికలు మింగాడు. బంధువులకు ఫోన్‌ చేసి ఆ విషయాన్ని చెప్పాడు. కృష్ణయ్య ఇంటికి చేరుకున్న బంధువులు ముగ్గురినీ హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. తల్లి, కుమార్తె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందారు. కృష్ణయ్యకు మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు