టిడిపి మంచి పార్టీ - వల్లభనేని వంశీ

త్రిశూల్ న్యూస్ డెస్క్ :
వల్లభనేని వంశీ మనసు మార్చుకున్నారా? వైసీపీలో రాజకీయాలతో ఆయన యూ టర్న్ తీసుకున్నారా? ఇటీవల జరుగుతున్న పరిణామాలతో కలత చెంది తిరిగి సొంత గూటికి చేరాలనుకుంటున్నారా?ఇప్పుడిదే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు ఆజ్యం పోస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ అంటూ ఆయన కీర్తించడం కొత్త సంకేతాలకు నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతటితో ఆగకుండా తానెప్పుడు టీడీపీకి తిట్టలేదని కూడా గుర్తుచేయడం విశేషం. నిన్నటిదాకా టీడీపీపై దుమ్మెత్తిపోసిన వల్లభనేని వంశీ సడన్ గా ఇలా మాట్లాడుతున్నారేంటి ? అన్న చర్చ జరుగుతుంది. వైసీపీలో అంతర్గత పోరు నేపధ్యంలో వల్లభనేని వంశీకి పొమ్మనలేక పొగబెడుతున్నారా అన్న చర్చ కూడా జోరందుకుంటోంది. ఓ క్రికెట్ టోర్నీలో విజేతలకు బహుమతులు అందించిన తరువాత వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని నడిపిన తీరుపై మాత్రమే తాను విమర్శలు చేశానని, లోకేష్ చేతుల్లోకి వచ్చిన తర్వాత పార్టీ విధానాలు దెబ్బతిన్నాయని మాత్రమే తాను విమర్శలు చేశానని వల్లభనేని వంశీ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం చేశారని, టిడిపి ద్వారా అనేక మంది బడుగు బలహీన వర్గాల వారు వెలుగులోకి వచ్చారని వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ అంటూ వల్లభనేని వంశీ టీడీపీకి కితాబు ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యాఖ్యలో చంద్రబాబు ప్రస్తావన తీసుకురాకపోడం అనుమానాలు పెరుగుతున్నాయి. కేవలం లోకేష్ విధానాలు నచ్చకే తాను పార్టీకి దూరమైనట్టు చెప్పడం ద్వారా ఆయన కొత్త సంకేతాలు పంపారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు వైసీపీలో ఆశించిన స్థాయిలో ఆదరణ లేకపోవడం, ఇటు టీడీపీకి బలం పెరుగుతుండడం తదితర కారణాలతో ఆయన పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.


అసమ్మతి పోటు..

వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని విడనాడి వైసిపి బాట పట్టిన తరువాత వైసిపి లో ఉన్న నేతలందరూ వల్లభనేని వంశీని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇక అధిష్టానానికి కూడా వల్లభనేని వంశీ తో కలిసి పని చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. అనేకమార్లు గన్నవరంలో వైసిపి నాయకులకు వల్లభనేని వంశీకి సయోధ్యకు ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో వల్లభనేని వంశీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీని పొగడటం వెనుక ఆయన యుటర్న్ తీసుకుంటున్నారా అన్న చర్చ జరుగుతుంది.
మనస్తాపంతోనే వ్యాఖ్యలు..

గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. వంశీ పార్టీలో చేరినప్పటి నుంచి వ్యతిరేకవర్గం కంటిమీద కునుకు ఉంచడం లేదు. అటు స్నేహితుడు కొడాలి నానికి అమాత్య పదవి దూరమైంది. నియోజకవర్గంలో చూస్తే దుట్టా వర్గం సహాయ నిరాకరణ చేస్తోంది. ఈ సమయంలో టీడీపీని దూరం కావడం తొందరపాటు చర్యేనని వంశీ తన అనుచరుల వద్ద బాదపడుతున్నారట. నియోజకవర్గంలో దుట్టా వర్గం ఏ పనిచేయనివ్వడం లేదు. మట్టి తవ్వకాలపై దుట్టా వర్గం ఆరోపణలను అధిష్టానం ద్రుష్టికి తీసుకెళ్లినా పెద్దలు పట్టించుకోకపోవడంపై వంశీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి దగ్గరయ్యే సమయంలో ఇచ్చిన హామీని సైతం మరిచిపోవడం తగునా అని ప్రశ్నిస్తున్నారు. అందుకే అటు పూర్వాశ్రమమైన టీడీపీని పొగడుతూ.. వైసీపీలో తనను వ్యతిరేకిస్తున్న వారిపై వంశీ వాయిస్ పెంచారు. వార్డ్ మెంబర్ గా గెలవని వ్యక్తులు కూడా విమర్శలు చేయడం సరికాదని దుట్టాను ఉద్దేశించి వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు. మట్టి అమ్ముకునే ఖర్మ తనకు పట్టలేదని వల్లభనేని వంశీ తేల్చిచెప్పారు. అక్రమ మట్టి తవ్వకాలపై ఎటువంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. ఇక దుట్టా వర్గం తాము వంశీతో కలిసి పని చేసేది లేదని ఇటీవల సీఎంఓలో సజ్జల రామకృష్ణా రెడ్డితో జరిగిన సమావేశంలో తేల్చి చెప్పారు. వైసీపీని వీడేది లేదని, వంశీకి వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తే పని చెయ్యబోనని ఆయన స్పష్టం చేశారు. అయితే వైసీపీలో వర్గ పోరుతోనే టీడీపీకి కితాబా? వల్లభనేని యూటర్న్ తీసుకుంటున్నారా? వల్లభనేని వంశీ తాజా వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు