ఉచితాలు దండగయ్యా...!
- కష్టం చేసుకునే వారికే డబ్బులు అందాలి
- పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డికి మహిళలు మొర
నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేపట్టిన పవనన్న ప్రజాబాట ఎనిమిదో రోజున మైపాడు రోడ్డు ప్రాంతంలోని రామిరెడ్డి కట్టెల దొడ్డి రోడ్డు, పుట్ట సెంటర్లో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఈ ప్రాంతంలోని ప్రజలు ముఖ్యంగా మహిళలు తమ సమస్యలు, బాధలు చెప్పుకున్నారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం పథకాల పేరు చెప్పి ఉచితంగా డబ్బులు పంచుతోందని, దీని కారణంగా అనేకమంది సోమరిపోతులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో కష్టపడి పని చేసేవారు తగ్గిపోతున్నారని, ప్రొడక్టివిటీ దెబ్బతింటోందని కేతం రెడ్డి ద్రుష్టికి పలువురు మహిళలు తీసుకువచ్చారు. పథకాల పేరుతో డబ్బులు మంచిదేనని, కాకపోతే ఆ డబ్బులు సరైన లబ్ధిదారులకు చేరాలని, అలా కాకుండా వేలాది కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నాయని విమర్శించారు.
ఉదాహరణకు టైలరింగ్ పేరుతో టైలర్లు కాని వారందరూ డబ్బులు పొందుతున్నారని, ఆ డబ్బులు వృధా అవడమే కదా అని అన్నారు. ఇలా ఉచితంగా కాకుండా నిజమైన టైలర్ల నుండి ప్రభుత్వ వ్యవస్థలకు, పాఠశాలలకు, కళాశాలలకు యూనిఫారం వంటివి కుట్టించుకుని నిజమైన లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వాలని మహిళలు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా చేనేత కార్మికుల నుండి ప్రభుత్వం నేత వస్త్రాలు కొని లబ్ధి చేకూర్చవచ్చు కానీ ఉచితంగా ఇస్తే డబ్బుకు విలువ ఉండదని అన్నారు. ఇలా ప్రతి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ప్రొడక్టివిటీ పెంచే దిశగా ఉపయోగించవచ్చని, నిజమైన లబ్ధిదారులకు చేరుతాయని, ఉచితంగా ధారపోసి ప్రజలను సోమరిపోతులుగా మార్చాల్సిన అవసరం లేదని కేతంరెడ్డి వినోద్ రెడ్డితో పలువురు మహిళలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే తరహా ఉచితాలు కొనసాగితే అతి త్వరలోనే మన రాష్ట్రం శ్రీలంక లాగా మారే అవకాశం ఉందని మహిళలు భయాందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై మహిళల్లో ఇంతటి చైతన్యాన్ని చూసిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆశ్చర్యపోయారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదిస్తే రాష్ట్రంలో సుభిక్షమైన పాలన ఉంటుందని వారికి కేతంరెడ్డి వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Post a Comment