పోలీస్ స్టేషన్ ముందే రాళ్లతో దాడులు..!

- చిత్తూరు జిల్లా గుడుపలల్లో ఉద్రిక్తత
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
మద్యం మత్తులో నలుగురి వ్యక్తుల మధ్య మొదలైన గొడవ.. చివరికి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌ ఎదుటనే వందలాది మంది రోడ్డుపైకొచ్చి రాళ్లు రువ్వి కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గుడుపల్లె మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుడుపల్లె మండలంలోని చీకటిపల్లె, కోట చెంబగిరి గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులు గురువారం ఏపీ సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం బిసానత్తం వద్ద మద్యం తాగారు. తిరుగు ప్రయాణంలో ఒంటిపల్లె వద్ద మద్యం మత్తులో వీరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించగా, రెండు గ్రామాల పెద్దలు శనివారం రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో సోమవారం పోలీసుల ఎదుట సర్ది చెప్పేందుకు గ్రామస్తులు మరోసారి ప్రయత్నించారు. ఈ సమయంలో ఒక వర్గానికే న్యాయం చేస్తున్నారంటూ మరో వర్గ ప్రజలు రోడ్డును దిగ్బంధించి నిరసనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే మరోసారి రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి మూడు గ్రామాల ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకొని, కర్రలతో దాడి చేసుకున్నారు. గుడుపల్లె మండల పరిధిలోని చీకటిపల్లె గ్రామం ఓ వర్గం కాగా, మరో వర్గం వైపు ఒంటిపల్లె, కోటచెంబగిరి గ్రామస్తులు నిలిచారు. ఈ దాడుల్లో రెండు వర్గాలకు చెందిన 12 మందికి గాయాలయ్యాయి. ఏం జరుగుతుందో అర్థం కాక.. గుడుపల్లె ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సీఐలు సూర్యమోహన్, శ్రీధర్‌ల ఆధ్వర్యంలో పోలీసులు అందరినీ చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ భరత్‌ రెండు వర్గాలకు నచ్చజెప్పి.. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. మరోవైపు పోలీస్ స్టేషన్ ఎదుట దాడులకు పాల్పడ్డ రెండు వర్గాలపై మూడు కేసులు నమోదు చేసినట్లు కుప్పం గ్రామీణ సీఐ సూర్యమోహన్‌ తెలిపారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు