ఏపిఆర్టీసీ బస్సుల్లోనూ డిజిటల్‌ చెల్లింపులు..!

- పైలట్‌ ప్రాజెక్టు కింద విజయవాడ, గుంటూరు–2 డిపోల ఎంపిక
విజయవాడ, త్రిశూల్ న్యూస్ : 
ఏపీఎస్‌ఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. బస్సుల్లోనూ నగదు రహిత డిజిటల్‌ చెల్లింపులకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం డ్రైవర్లు, కండక్టర్ల వద్దనున్న టికెట్‌ ఇష్యూయింగ్‌ యంత్రాల(టిమ్స్‌) స్థానంలో ఈ–పోస్‌ యంత్రాలను అందుబాటులోకి తెస్తోంది. వీటితో ప్రయాణికులు నగదు చెల్లించనవసరం లేకుండా డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు, ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి వాటితో టికెట్లు పొందొచ్చు. ఫలితంగా బస్సుల్లో చిల్లర సమస్య ఉండదు. పైలట్‌ ప్రాజెక్టు కింద విజయవాడ, గుంటూరు–2 డిపోలను ఎంపిక చేశారు. ఈ డిపోల నుంచి తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంత సర్వీసుల్లో ఈ–పోస్‌ మెషీన్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ రూట్లలో విధులు నిర్వర్తించే డ్రైవర్లు, కండక్టర్లకు ఈ–పోస్‌ యంత్రాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో డిపో నుంచి పది మంది చొప్పున డ్రైవర్లు, డ్రైవర్‌ కం కండక్టర్లు మూడు వారాలుగా ఈ శిక్షణ పొందుతున్నారు. వీరికి శిక్షణ పూర్తయ్యాక ఈ–పోస్‌ యంత్రాలు ప్రవేశపెడతారు. దశలవారీగా అన్ని డిపోల్లోనూ, నిర్దేశిత బస్టాండ్లు, బస్టాపుల్లో టిక్కెట్లు ఇచ్చే గ్రౌండ్‌ బుకింగ్‌ స్టాఫ్‌కు కూడా ఈ–పోస్‌ యంత్రాలను సమకూర్చనున్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు