అట్టుడుకుతున్న అమలాపురం..!

- జిల్లా ఎస్పీ వాహనంపై రాళ్లు దాడి

- కోనసీమలో అదుపుతప్పిన ఆందోళన..
అమలాపురం, త్రిశూల్ న్యూస్ :
కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ కోనసీమ ప్రజలు పోరు బాట పట్టారు. ఆందోళనలో భాగంగా మంగళవారం జిల్లా ఎస్పీ వాహనంపై 
ఆందోళన కారులు రాళ్ల వర్షం కురిపించారు. ఆందోళనకారులను చెదరగోడుతున్న క్రమంలో అమలాపురం డిఎస్పీ మాధవ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కోనసీమ రణ క్షేత్రంగా మారింది. ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికీ కారణం జిల్లా పేరు మార్చడమే. అవును.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వం కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది. అంతా సవ్యంగా ఉన్న క్రమంలో.. కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేద్కర్ జిల్లాగా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇదే కోనసీమ వాసులకు ఆగ్రహం తెప్పించింది. కోనసీమనే ముద్దు.. మరే పేరు వద్దు అంటూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోనసీమ సాధన సమితి గళమెత్తింది. ఈ క్రమంలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. వందల సంఖ్యలో జనాలు తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. కలెక్టరేట్‌ ముట్టడికి యువకులు, నిరసనకారులు ప్రయత్నించారు. కోనసీమ సాధన సమితి పిలుపు నేపథ్యంలో పోలీసులు అమలాపురం వ్యాప్తంగా 144 విధించారు. అమలాపురం మొత్తాన్ని అష్టదిగ్భంధనం చేశారు. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు నిరసనకారులు. ఒక దశలో పోలీసులతో తీవ్ర ఘర్షణకు దిగిన ఆందోళనకారులు.. వారిపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో 20 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. ఆ తరువాత పోలీసులను తప్పించుకుని వచ్చిన ఆందోళనకారులు.. కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్‌ ను ధ్వంసం చేశారు. అక్కడే కలెక్టర్ రేట్ ఎదుట ఒక బస్సును ఆందోళన కారులు దగ్ధం చేశారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు