పాత్రికేయుల్ని జైలకు పంపొద్దు..!
- రాతలు, ట్వీట్లపై ఇలాంటి చర్యలు తగదు
- జుబైర్ అరెస్టుపై ఐరాస ప్రతినిధి వ్యాఖ్యలు
ఐక్యరాజ్యసమితి, త్రిశూల్ న్యూస్ :
పత్రికల్లో రాసే రాతలు, చేసే ట్వీట్లను బట్టి పాత్రికేయులను జైలుకు పంపించడం సరైనది కాదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియో గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు. ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ అరెస్టుపై ఆయన స్పందించారు. 'ప్రపంచంలోని ప్రతీ ఒక్కరికీ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశం కల్పించాలి. అది చాలా ముఖ్యమని నా అభిప్రాయం. పత్రికల్లో రాసే రాతలు, సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు, ప్రసంగాలను బట్టి పాత్రికేయులను జైలుపాలు చేయొద్దు. ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచంలో ఎక్కడైనా ఈ సూత్రాన్ని పాటించాలి. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచకుండా జర్నలిస్టును వేధింపులు గురి చేయవద్దు' అన్నారు. ఓ సమావేశంలో జుబైర్ అరెస్టుపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు.
భారత్‌లో జర్నలిస్టులకు అభద్రత
న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్జీవో కమిటీ ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) జుబైర్ అరెస్టును ఖండించింది. భారత్‌లో పత్రికా స్వేచ్ఛ దిగజారుతుందనడానికి జుబైర్ అరెస్టు తాజా ఉదాహరణ అని సీపీజే ఆసియా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ స్టీవెన్ బట్లర్ అన్నారు. మత సంబంధిత సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే పాత్రికేయులకు ప్రభుత్వం ప్రతికూల పరిస్థితులను సృష్టిస్తున్నదని దుయ్యబట్టారు. జుబైర్‌ను విడుదల చేయాలన్నారు. కాగా, హిందూ దేవుళ్లను కించపరుస్తూ ట్వీట్ చేశారని జుబైర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.
Comments
Post a Comment