చంద్రబాబు హయాంలో వర్షాలు పడలేదు.. రోడ్లు పాడు కాలేదు..!

- వైసిపి ప్లినరీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి 
పుంగనూరు, త్రిశూల్ న్యూస్ :
పుంగనూరులో వైసీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి, వేంకటేష్ గౌడ, జెడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల గత రెండేళ్లు వైసీపీ ప్లీనరీ జరుపుకోలేకపోయామని, జూలై 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ సమావేశం జరుగుతుందని తెలిపారు. 95 శాతం ఎన్నికల హామీలు పూర్తి చేసిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు. 500 హామీలు ఇచ్చి మేనిఫెస్టో మాయం చేసిన ఘనత చంద్రబాబుదే అని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు.
వైసీపీలో ఏ సమస్యలు ఉన్నా నేరుగా తనకు సమాచారం అందిస్తే తక్షణం స్పందిస్తానని సూచించారు. తనపై బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో నేరుగా గడప గడపకు వెళ్లలేకపోయానని తెలిపారు. తన తరపున ఇతర నాయకులు గడప గడపకు తిరుగుతున్నారని.. వైసీపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. కులం, మతం, పార్టీ చూడకుండా పేదరికం చూసి వైఎస్ జగన్ పథకాలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఎన్నికల్లో ఓడిపోయినా వారిని జన్మభూమి కమిటీల్లో వేసిన వ్యక్తి చంద్రబాబు అని.. ఆ కమిటీల్లో వారు వాళ్లకు కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చే వారని విమర్శలు చేశారు. ఆసరా కింద రూ.26 వేల కోట్లను నాలుగు విడతల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. గతంలో డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. తన ఇన్నేళ్ల రాజకీయ ప్రయాణంలో 95 శాతం హామీలు అమలు చేసిన వేరే ముఖ్యమంత్రిని తాను చూడలేదన్నారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు ఇచ్చేందుకు ఆరు జిల్లాలకు రూ.8 వేల కోట్లకు పైగా సీఎం జగన్ మంజూరు చేశారన్నారు. గండికోట నుంచి మనకు నీరు ఇచ్చేందుకు రూ. 2,700 కోట్లతో ప్రాజెక్టులు సిద్ధం చేస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో అసలు వర్షాలు పడేవి కాదని.. అందుకే రోడ్లు పాడు అయ్యేవి కాదని మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. అక్కడక్కడా రోడ్లు పాడైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు