Trishul News

మళ్ళీ మొదలైన రైతుల ఆందోళనలు..!

- పంజాబ్ లో రైలు పట్టాలపై బైఠాయింపు

- నాలుగు గంటలు రైళ్ళ రాకపోకలు బంద్ 
పంజాబ్, త్రిశూల్ న్యూస్ :
గతేడాది చివరిలో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇంకా నెరవర్చలేదంటూ పంజాబ్ రైతులు మళ్లీ ఆందోళన చేశారు. లంఖిపూర్ ఖేరీ హింసా ఘటనపై, అలాగే వాగ్ధానాలు అమలుపై కేంద్రం తీరును నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దీనిని చేపట్టారు.ఇందులో భాగంగా పంజాబ్ లో అనేక చోట్ల రైతులు రైలు పట్టాలపై బైఠాయించారు. పంజాబ్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రైళ్లను నిలిపివేశామని భారతీయ కిసాన్ యూనియన్ (లఖోవాల్) ప్రధాన కార్యదర్శి హరీందర్ సింగ్ లఖోవాల్ తెలిపారు. నాలుగు గంటలపాటు సాగిన ఈ నిరసన వల్ల రాష్ట్రంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. జలంధర్, ఫిలింనగర్, ఫిరోజ్‌పూర్, భటిండా సహా పలు చోట్ల రైలు పట్టాలపై ఆందోళనకారులు బైఠాయించారు. రైతుల డిమాండ్లలో కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ. లఖింపూర్ ఖేరీ హింస కేసులో సత్వర న్యాయం ఉన్నాయని లఖోవాల్ అన్నారు. గతేడాది అక్టోబరు 3వ తేదీన ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పర్యటనకు వ్యతిరేకంగా రైతులు లఖింపూర్‌ ఖేరీలో ఆందోళన చేశారు. అయితే ఈ సమయంలో చెలరేగిన హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో పాటు మొత్తగా 8 మంది చనిపోయారు. ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
తాజా ఆందోళనల్లో రైతులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాది వ్యవసాయ వ్యతిరేక చట్టాల నిరసన సందర్భంగా రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్ ను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఇటీవల ఏర్పాటు చేసిన కనీస మద్దతు ధరపై ప్యానెల్ విషయంలో హరీందర్ సింగ్ లఖోవాల్ మాట్లాడుతూ.. కేంద్రం రద్దు చేసిన చట్టాలను రూపొందించిన వారు, అలాగే వాటికి అనుకూలంగా వ్యవహరించిన వారినే ప్రభుత్వం ఈ కమిటీల్లో చేర్చిందని అన్నారు. కాగా.. ఫిలింనగర్ రైల్వే స్టేషన్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ కిసాన్ యూనియన్ (కడియన్) అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కడియన్ మాట్లాడుతూ.. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు రైతులు ఈ నిరసనను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం తన వాగ్దానాలను అమలు చేయకపోవడంతో ఇలా పట్టాలపై పడిగాపులు గాయాల్సి వచ్చిందని అన్నారు.

Post a Comment

Previous Post Next Post