విశ్వంలోని హిందువుల దర్శనీయ స్థానం తిరుమల - టిటిడి ఈఓ

- తిరుమలలో భక్తులకు స్నేహపూర్వక వాతావరణం

- మహారాష్ట్ర ఎంపి సంజయ్ జాదవ్
తిరుమల, త్రిశూల్ న్యూస్ :
విశ్వంలోని హిందువులందరి దర్శనీయ స్థానంగా తిరుమల వర్ధిల్లుతోందని, శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టిటిడి ఇక్కడ స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తోందని మహారాష్ట్రలోని పర్బని ఎంపి సంజయ్ జాదవ్ పేర్కొన్నారు. ఆదివారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఎంపీ మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ప్రతిమను కారులో తీసుకొచ్చినందుకు అలిపిరి చెక్ పాయింట్ వద్ద టిటిడి సెక్యూరిటీ అవమానించారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారిందన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హిందువుల పుణ్యక్షేత్రం కావడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద ప్రతి వాహనాన్ని భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తారని చెప్పారు. రాజకీయ పార్టీలు, ఇతర మత విశ్వాసాల చిత్రాలు, గుర్తులు, వ్యక్తుల చిత్రాలు, జెండాలు తీసుకెళ్లరాదని టిటిడి నిబంధనలు ఉన్నాయన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా, మహారాష్ట్ర యాత్రికుడి వాహనాన్ని కూడా తనిఖీ చేశారని, శ్రీ శివాజీ మహరాజ్ ప్రతిమ అని నిర్ధారించుకున్న తర్వాత వాహనాన్ని తిరుమలకు అనుమతించిననట్టు చెప్పారు. అయితే టిటిడి బోర్డును దూషిస్తూ ఓ భక్తుడు ఓ వీడియోను వైరల్ చేశారని, వాస్తవానికి ఇది సరికాదని, మహారాష్ట్ర ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. యాత్రికులు సంతోషంగా తిరుమలను సందర్శించాలని, శ్రీవారి సేవలో తరించాలని కోరారు.  శ్రీశ్రీశ్రీ రమాకాంత్‌జీ వ్యాస్ మహరాజ్ మాట్లాడుతూ తిరుమలలో మూడు రోజులు బస చేశామని, ఇక్కడ ఎలాంటి అసమానతలు లేవని, దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులను సమానంగా చూస్తున్నట్లు గుర్తించామని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు నిబంధనలు పాటించి భద్రతా తనిఖీలకు సహకరించాలన్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని మహారాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. హిందూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనమందరం చేతులు కలపాలని కోరారు. టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ హిందువులు పూజించే శ్రీ ఛత్రపతి శివాజీ, శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ వివేకానంద తదితర మహనీయుల ప్రతిమలు, చిత్రపటాలను తిరుమలకు అనుమతిస్తామని పునరుద్ఘాటించారు. శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తిరుమలకు అనుమతించడం లేదని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు రాజకీయ, ఇతర హిందూయేతర విశ్వాసాలకు సంబంధించిన ప్రతిమలు, వస్తువులను అనుమతించకూడదని టిటిడి నిర్ణయించినట్లు ఈఓ తెలిపారు. కమ్యూనికేషన్ లోపం కారణంగా కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర భక్తుడి వాహనంలో శ్రీ ఛత్రపతి శివాజీ విగ్రహం గురించి వివాదం చెలరేగిందని ఆయన అన్నారు. అయితే సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారమైందని, సాధారణ భద్రతా తనిఖీల తర్వాత భక్తుడి వాహనాన్ని తిరుమలకు అనుమతించినట్టు చెప్పారు. కానీ సదరు భక్తుడు ప్రచారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని, ఇది మహారాష్ట్రీయుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని అన్నారు. హైందవ మత ప్రతిష్టను కాపాడిన శ్రీ ఛత్రపతి శివాజీపై తమకు అపారమైన గౌరవం ఉందని, ఇలాంటి అవాస్తవ ప్రకటనలను నమ్మవద్దని ఆయన మహారాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం టిటిడి బోర్డు సభ్యుడు మిలింద్ నర్వేకర్ తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో ఈవోకు శ్రీ ఛత్రపతి శివాజీ ప్రతిమను బహూకరించారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు