ఈడీ కేసులో మోడీకి చెక్ పెట్టిన సోనియాగాంధీ..!

న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ :
రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది. ఒక పార్టీ వేసిన ఎత్తుకు ప్రత్యర్థి పార్టీ పై ఎత్తు వేస్తుంది. వ్యూహాలను చిత్తు చేస్తుంది. రెండుపార్టీల మధ్య ఎక్కడైనా రాజకీయం ఇలాగే నడుస్తుంది. ప్రత్యర్థులుగా ఉన్నంతవరకు స్నేహపూర్వక వాతావరణమే ఉంటుంది. కానీ వ్యక్తిగతానికి దారితీసినప్పుడు రాజకీయ విపరిణామాలు సంభవిస్తాయి. ప్రస్తుతం భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ మధ్య ఈ తరహా ధోరణి నెలకొందని, ప్రజాస్వామ్యానికి అది మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అన్నీ మోతీలాల్ వోరా చూసుకునేవారు

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీని ప్రస్తుతం ఈడీ విచారిస్తోంది. విచారణలో భాగంగా అధికారులు రూపొందించుకున్న ప్రశ్నలకు సోనియాగాంధీ ఒకటే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోతీలాల్ వోరా చూసుకునేవారని వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా, కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన వోరా 2020 డిసెంబరులో అనారోగ్యంతో మృతిచెందారు.

అహ్మద్ పటేల్ పై సిట్ ఆరోపణలు..!

కొద్దిరోజుల క్రితం గుజరాత్ అల్లర్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెల్లడైంది. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీకి క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆ తర్వాత రోజే సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్ చేశారు. అల్లర్ల కేసులో మోడీని ఇరికించేందుకు కాంగ్రెస్ పార్టీ నేత అహ్మద్ పటేల్ ప్రయత్నించినట్లు సిట్ తన నివేదికలో వెల్లడించింది. ఆయనతోపాటు సెతల్వాద్‌, రిటైర్డ్ డీజీపీ ఆర్‌.బి.శ్రీకుమార్‌, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌పై కేసు నమోదు చేసింది. అహ్మద్ పటేల్ 2020 నవంబరులో అనారోగ్యంతో మృతిచెందారు

మరణించినవారిని కూడా వదిలిపెట్టడంలేదంటూ..

సిట్ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మరణించినవారిని కూడా ప్రధానమంత్రి తన రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటున్నారని, రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. ఇలాంటి ధోరణి మంచిది కాదని పలువురు కాంగ్రెస్ నేతలు కూడా వ్యాఖ్యానించారు. తన తండ్రి పేరును అన్యాయంగా వాడుతున్నారంటూ అహ్మద్ పటేల్ కుమార్తె ముంతాజ్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ వ్యూహాన్నే అమలు చేసిన కాంగ్రెస్

మరణించిన అహ్మద్ పేటల్ పేరును సిట్ లో చేర్చడంవల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని బీజేపీ నేతలకు తెలుసు. కానీ కాంగ్రెస్ ను మానసికంగా దెబ్బతీయాలనే వ్యూహంతో వ్యవహరించినట్లు సీనియర్ రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మోతీలాల్ వోరా పేరుతో కాంగ్రెస్ పార్టీ ఈడీ కేసులో ఇదే తరహా వ్యూహాన్ని అవలంబిస్తోంది. దీనిద్వారా తమకు ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేస్తున్నట్లు అర్థమవుతోంది. హెరాల్డ్ నిధులను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుందనేది ప్రధాన అభియోగంగా ఉంది. వోరా పార్టీ కోశాధికారిగా కూడా వ్యవహరించారు. ఏతావాతా ఈడీ చేయాల్సిందేమిటంటే.. ఆ నిధులు ఏమయ్యాయి? ఎలా దుర్వినియోగం జరిగింది? తదితర ప్రశ్నలను వోరానే అధికారులు అడగాల్సి ఉంటుంది. మృతిచెందినవారిని ఉపయోగించుకొని ఏ తరహా రాజకీయం చేయాలని బీజేపీ భావిస్తుందో.. అదే తరహా వ్యూహాన్ని అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ గట్టి షాకిచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సిట్ కేసులో పటేల్ శిక్ష అనుభవించలేరు. హెరాల్డ్ కేసులో వోరా కూడా అంతే.!!

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు