యాప్ రుణాల కట్టడికి పోలీసు నియామకాలు - డీజీపీ
అనంతపురం, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్రంలో త్వరలో పోలీసు నియామకాలు చేస్తామని డీజీపీ రాజేంద్రనాథరెడ్డి వెల్లడించారు. సుదీర్ఘ కాలంగా పోలీసు శాఖలో పెండింగ్ లో ఉన్న నియామకాల అంశాలపైన పలు సార్లు చర్చలు జరిగాయి. అయితే జాబ్ క్యాలెండర్ విడుదలలో భాగంగా పోలీసు శాఖలోనూ భర్తీ పైన ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించారు. కొత్త నియామకాల విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. తాజాగా.. యాప్ రుణాల వ్యవహారం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అనేక మంది ఈ ఉచ్చులో చిక్కుకొని ఆర్దికంగా నష్టపోతున్నారు. వేధింపులకు గురవుతున్నారు. దీని పైన డీజీపీ స్పందించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాల పర్యటనకు వచ్చిన డీజీపీ యాప్ రుణాలను కట్టడి చేయటానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు చెప్పారు. పోలీసులకు సైబర్ నేరాలను అడ్డుకునే శిక్షణ ఇస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. ఇక ప్రభుత్వం గతంలోనే పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవు ప్రకటించింది. కానీ వారాంతపు సెలవుల విషయంలో పదవీ విరమణలు ఎక్కువుగా ఉన్నందున పనిచేస్తున్న వారిపై కొంత పనిభారం ఉంటుందని డీజీపీ చెప్పుకొచ్చారు. రౌడీషీటర్ తెరిచే విషయమై కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే అలాంటి ఆదేశాలు ఇచ్చామన్నారు. రహదారులపై ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకునేలా వివిధ శాఖలతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో నేరాలపైన ఆయన రివ్యూ చేసారు. అదే సమయంలో పోలీసు శాఖ పని తీరు గురించి సమీక్షించారు. పలు చర్యల పైన డీజీపీ అధికారులకు సూచనలు చేసారు.
Comments
Post a Comment