పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ..!
- పారిశుధ్య పనులను పరిశీలించిన నెల్లూరు కమిషనర్ హరిత
నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, వర్షాకాలానికి తగిన విధమైన ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని కమిషనర్ శ్రీమతి హరిత అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 18 వ డివిజను అరవింద్ నగర్, 42 వ డివిజను కోటమిట్ట ప్రాంతాల్లోని పారిశుధ్య విభాగ కార్యాలయాలను అధికారులతో కలిసి కమిషనర్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయాల్లోని అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తడి, పొడి చెత్తలను విడివిడిగా సేకరించినపుడే రీసైక్లింగ్ పద్ధతి ద్వారా సేంద్రీయ ఎరువులను తయారు చేయగలమని, నగర పాలక సంస్థ చెత్త సేకరణ వాహనాలకు నగర పౌరులంతా విడివిడిగా చెత్తను అందించి సహకరించాలని కోరారు. నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో పారిశుద్ధ్య పనులను క్రమంతప్పకుండా నిర్వహించేలా ప్రజలు కూడా స్వచ్ఛందంగా పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్యానికి హానికరమైన దోమల సంతాన ఉత్పత్తిని అడ్డుకునేలా డ్రైను కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పూడికతీత పనులను నిర్వహించాలని అధికారులు, సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సచివాలయం కార్యదర్శులు, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment