రాబోయే ఎన్నికల్లో బిజెపితో తెలుగుదేశం దోస్తీ..?

- మూడేళ్ళ తరువాత మోడితో బాబు బంధం

- జూ. ఎన్టీఆర్ అమిత్ షా కలవడంతో వేడెక్కిన రాజకీయం
హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలపై పూర్తి ఫోకస్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ.. పార్టీ పెద్దలు పదే పదే తెలంగాణకు వస్తున్నారు.. ప్రముఖులను కలుస్తున్నారు. మొన్న అమిత్ షా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ను కలిస్తే.. ఇప్పుడు నితిన్ వంతు వచ్చింది. ఆయన నడ్డాతో సమావేశం అవ్వడం చూస్తుంటే.. తెలంగాణలో గెలుపు కోసం బీజేపీ ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తోందని చెప్పొచ్చు. మరోవైపు వరుస పరిణామాలు చూస్తుంటే.. త్వరలోనే కీలక అడుగులు పడితాయనే సంకేతాలు అందుతున్నాయి. ఈ ప్రభావం ఏపీ రాజకీయాలపైనా పడుతుందని ప్రచారం ఉంది. ప్రస్తుతం మునుగోడు ఎన్నికలను.. తెలంగాణలో వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్ గా బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి నుంచి కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్, రామోజీరావుతో జరిపిన భేటీలు నిదర్శనం. ఈ ఇద్దరితో మర్యాదపూర్వక భేటీ అని బీజేపీ నేతలు చెబుతున్నా.. రాజకీయ ప్రాధాన్యం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో తాజాగా చంద్రబాబుకు ఎన్ఎస్జీ అదనపు భద్రత కల్పించారు. ఈ పరిణామాల వెనుక బలమైన రాజకీయ కారణం ఉందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా త్వరలో కీలక నిర్ణయానికి వీటిని మెట్లుగా భావిస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పటివరకూ బీజేపీ ధీమాగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో మారుతున్న పరిస్ధితులు ఆ పార్టీని కలవరపెడుతున్నాయా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముందు జాగ్రత్త చర్యగా..? ఇంతవరకూ సీరియస్ గా ఫోకస్ పెట్టని తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో వీలైనన్ని ప్రయోగాలు చేసేందుకు బీజేపీ అధిష్టానం సిద్దమవుతోందనే ప్రచారం ఉంది. ఇందులో భాగంగానే ఓవైపు అధికారంలో ఉన్న కర్ణాటకలో దాన్ని నిలబెట్టుకుంటూనే పొరుగున ఉన్న తెలంగాణలో తొలిసారి అధికారం అందుకునేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.
తెలంగాణలో అధికారం చేపట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ అంత ఈజీ కాదు.. బీజేపీ నేతలు మాత్రం తామే.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని.. అధికారం సాధించి తీరుతామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో బలం చూసుకుంటే.. కాంగ్రెస్ చాలా చోట్ల బీజేపీ కంటే బలంగా ఉందన్నది రాజకీయ విశ్లేషకులు మాట.. ఆ విషయాన్ని గుర్తించే బీజేపీ పెద్దలు.. సరికొత్త ఎత్తులతో.. కాంగ్రెస్ ను దాటి.. టీఆర్ఎస్ ఢీ కొనేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు అమిత్ షా ఇప్పుడు వరుసగా హైదరాబాద్ పర్యటనలు చేస్తున్నారు. అక్కడ ఆయన రచిస్తున్న వ్యూహాలు రాజకీయ ప్రత్యర్ధులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ వచ్చిన అమిత్ షా.. టాలీవుడ్ యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు, మీడియా దిగ్గజం రామోజీ రావును కలిశారు. వీరిద్దరితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాజా రాజకీయపరిణామాలపై చర్చించారు. రామోజీరావుతో భేటీలో రాజకీయాల ప్రస్తావన ఎలాగూ ఉంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రం సినిమాలపై చర్చించారని తొలుత బీజేపీ లీకులిచ్చింది. కానీ జరిగింది వేరు. భవిష్యత్తులో తెలంగాణ ఎన్నికలతో పాటు ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వీరిద్దరి సహకారం తీసుకోవాలనేది అమిత్ షా అసలు వ్యూహం అంటూ.. ఆ పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది.
అయితే ఒకప్పుడు బీజేపీతో కలిసి కేంద్ర, రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేసి అధికారం పంచుకున్న చంద్రబాబు ఆ తర్వాత దూరమై అదే పార్టీపై ధర్మపోరాటం చేసి విఫలమయ్యారు. దీంతో మూడేళ్ల పాటు చంద్రబాబును అస్సలు పట్టించుకోని బీజేపీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరనే సత్యాన్ని గ్రహించింది. అందుకే ఇప్పుడు చంద్రబాబుపై స్పెషల్ ఫోకస్ పెడుతునట్టు కనిపిస్తోంది. అంతే కాదు ఇప్పుడు చంద్రబాబుకు అదనపు భద్రత కల్పించేందుకు ఎన్ఎస్జీ అధికారుల్ని సైతం ఇంటికి, టీడీపీ కార్యాలయానికి పంపింది. ఇంతకీ అమిత్ షా తాజా హడావిడి వెనుక అసలు ప్లాన్ ఇదే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుని పోటీ చేసేందుకు రంగం సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో వీరికి ప్రచారం చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ను ఒప్పించేందుకే అమిత్ షా ఆయన్ను పిలిపించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ రాజకీయాలకు దూరంగా ఉన్న జూనియర్ ను వచ్చే ఏడాది ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది. అయితే అది కేవలం బీజేపీ తరపున కాకుండా..? టీడీపీ-బీజేపీ కూటమి తరఫున అనే ప్రచారం ఉంది. అలా అయితేనే ఆయన ఒకే చెప్పే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ తో పాటు ఆంధ్రా ఓట్లు ఎక్కువగా ఉండే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చంద్రబాబు పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఓట్లు కొల్లగొట్టాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇటు కేసీఆర్ కు అండగా నిలుస్తున్న రామోజీరావుకు ఈసారి టీడీపీ-బీజేపీ పొత్తు గురించి చెప్పి ఆయన సాయం తీసుకునేందుకే అమిత్ షా భేటీ అయినట్లు తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు