తెలుగును కాపాడుకునేందుకు పెద్ద ఉద్యమం చేయాలి - చంద్రబాబు
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న మనం... ఇప్పుడు తెలుగును కాపాడుకునేందుకు ఇంకా పెద్ద ఉద్యమం చేయాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి తెలుగు మీడియం మాయమవుతుందని వింటుంటే బాధగా ఉందన్నారు. ఒక రాష్ట్రం నుంచి ఇలా పూర్తిగా మాతృభాష బోధనా భాషగా మాయం కావడమనేది దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. దేశంలో భాషా ప్రాతిపదికగా ఏర్పడిన తొలి రాష్ట్రంలో ఇలా జరగడం ఇంకా దురదృష్టకరమన్నారు. తెలుగు అకాడమీని తెలుగు, సంస్కృత అకాడమీగా పేరు మార్చాక రూ.63 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయన్న వార్త తప్ప... ఆ సంస్థ తెలుగు భాష కోసం ఏం చేస్తుందనేది ఎవరికీ తెలియదని చంద్రబాబు అన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తూ... తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని కాపాడుకునేందుకు మనందరం పునరంకితమవుదామని పిలుపుపిచ్చారు. ఒక జాతి పురోగమన మార్గాన్ని ముందుండి నడిపించేది తల్లి భాషని అన్నారు. తెలుగును వాడుకభాషగా సామాన్యులకు చేరువ చేసేందుకు ఆనాడు గిడుగు రామ్మూర్తి పెద్ద పోరాటమే చేశారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి 2018 లో ఏపీ తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్ధను ఏర్పాటుచేశామని చంద్రబాబు పేర్కొన్నారు.
Comments
Post a Comment