కుప్పంపై కక్ష కట్టి దౌర్జన్యాలు చేస్తున్నారు - చంద్రబాబు

- హారుతులతో స్వాగతం పలికిన మహిళలు
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
కుప్పం నియోజకవర్గంపై వైకాపా నేతలు కక్ష కట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పోలీసులను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మూడో రోజు పర్యటనలో భాగంగా కుప్పంలోని మోడల్‌ కాలనీలో ఆయన పర్యటించి మాట్లాడారు. 650 గృహాలతో మోడల్‌ కాలనీ నిర్మాణం ప్రారంభించామని.. 1+3 విధానంలో 3వేల మందికి విస్తరించాలని ప్రణాళిక రూపొందించి అనుమతులు ఇచ్చామన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్ల నిర్మాణం ఆపేశారన్నారు. కుప్పంపై సీఎంకు అభిమానం ఉంటే తాను 3వేల ఇళ్లు కట్టిస్తే ఆయన 10వేల ఇళ్లు కట్టించాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి ఆపేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌, వైకాపా నేతలపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు..

అమ్మ క్యాంటీన్‌ను స్టాలిన్‌ కొనసాగిస్తున్నారు..
''నేరస్థుల పాలన ఎలా ఉంటుందో నిన్న చూశాం. కుప్పం చరిత్రలో అది చీకటి రోజు. ఈ నియోజకవర్గంపై మీకెందుకంత కోపం? పేదవాడి పొట్టనింపే అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేశారు. దాని నిర్వాహకునిపై దాడి చేశారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్‌ ఉంటే దాన్ని ఇప్పటికీ సీఎం స్టాలిన్‌ కొనసాగిస్తున్నారు. హంద్రీనీవా పనుల్లో మరో రూ.50కోట్లు ఖర్చు చేసి ఉంటే నీళ్లు వచ్చేవి. నేను పులివెందులను అభివృద్ధి చేశాను. గండికోట నుంచి నీళ్లిచ్చాను.
ఎస్పీ స్థానికంగా ఉన్నప్పుడే దాడి
ఈరోజు ఎమ్మెల్సీ భరత్‌ ఇంటి వద్ద వందల మంది పోలీసులను భద్రతగా పెట్టారు. అదే పోలీసులను అన్న క్యాంటీన్‌ దగ్గర ఎందుకు పెట్టలేదు? పోలీసులు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారు. పేదవాడికి అండగా ఉంటా. నేను సీఎంగా ఉన్న 14 ఏళ్లు పోలీసులను ఇలాగే వినియోగించి ఉంటే నువ్వు బయట తిరిగేవాడివా? వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అభివృద్ధి చేయకుండా ఇప్పుడు గడపగడపకు అంటూ తిరుగుతున్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే వదిలిపెట్టను. నిన్న ఎస్పీ స్థానికంగా ఉన్నప్పుడే దాడి జరిగింది. ఆ పరిణామాలకు డీజీపీ సమాధానం చెప్పాలి'' అని చంద్రబాబు అన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు