యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు దర్శనం..!

తిరుమల, త్రిశూల్ న్యూస్ :
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీ మలయప్పస్వామివారు యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

సింహ వాహనం – ధైర్యసిద్ధి..!
శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహంపై కూర్చొని ఊరేగుతారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు మూరంశెట్టి రాములు, పోకల అశోక్‌కుమార్‌, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్‌, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌బాబు, పేష్కార్ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.




Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు