హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి..!
తిరుమల, త్రిశూల్ న్యూస్ :
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు బుధవారం రాత్రి శ్రీ మలయప్పస్వామి వారు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు.
హంస వాహనం - బ్రహ్మపద ప్రాప్తి
హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామి వారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.
కాగా, సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన గురువారం ఉదయం 8 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవలు జరుగుతాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment