గ‌రుడ‌సేవ‌కు టిటిడి విస్తృత ఏర్పాట్లు..!

- దాదాపు మూడు లక్షల మంది భక్తులకు వాహ‌నసేవ‌ దర్శనభాగ్యం

- భ‌క్తుల కోసం హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు
తిరుమల, త్రిశూల్ న్యూస్ :
           శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 1న జ‌ర‌గ‌నున్న గరుడసేవకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టింది. దాదాపు మూడు లక్షల మంది భక్తులకు శ్రీ‌వారి గ‌రుడ వాహ‌నసేవ‌ దర్శనం చేయించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. గ్యాల‌రీల్లో ఉద‌యం 6 నుండి రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు అందిస్తారు. అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో రాత్రి ఒంటి గంట వ‌రకు అన్న‌ప్ర‌సాదాలు అంద‌జేస్తారు. భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండేలా గ్యాల‌రీల‌కు అనుసంధానంగా తాత్కాలిక మ‌రుగుదొడ్లు ఏర్పాటుచేశారు. అద‌న‌పు సిబ్బందితో మెరుగైన పారిశుద్ధ్య చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ట‌ప్ప‌ర్‌వేర్ బాటిళ్లు వాడండి..
         
           గ్యాల‌రీల్లో వేచి ఉండే భ‌క్తుల కోసం సుర‌క్షిత తాగునీటిని టిటిడి అందుబాటులో ఉంచింది. భ‌క్తుల‌కు గ్లాసుల ద్వారా నీటిని అందిస్తారు. భ‌క్తులు తాగునీటిని త‌మ‌వద్ద ఉంచుకోవాల‌నుకుంటే ట‌ప్ప‌ర్‌వేర్ బాటిళ్లు గానీ, స్లీట్ లేదా రాగి సీసాలు గానీ వినియోగించాల‌ని టిటిడి కోరుతోంది.  
     
హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు..

           గ‌రుడ సేవ సంద‌ర్భంగా భ‌క్తుల‌కు కావాల్సిన స‌మాచారాన్ని అందించేందుకు ఏడు ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటుచేశారు. జిఎన్‌సి టోల్‌గేట్‌, సిఆర్వో, బాలాజి బ‌స్టాండ్‌, రాంభ‌గీచా విశ్రాంతి గృహాలు, రాగిమాను సెంట‌ర్‌, ఎటిసి స‌ర్కిల్‌, బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద హెల్ప్ డెస్క్‌లు ఉన్నాయి.

కామ‌న్ క‌మాండ్ సెంట‌ర్‌.. 

           పిఏసి-4లో ఏర్పాటుచేసిన కామ‌న్ క‌మాండ్ సెంట‌ర్‌లో భ‌క్తులు ఫోన్ ద్వారా అడిగే సందేహాల‌ను నివృత్తి చేస్తారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబ‌రు : 1800425111111 అందుబాటులో ఉంచారు. భ‌క్తులు సులువుగా మాడ వీధుల్లోని గ్యాల‌రీల్లోకి ప్ర‌వేశించేందుకు వీలుగా సైన్‌బోర్డులు ఏర్పాటుచేశారు. వీటిలో ప్ర‌వేశ‌, నిష్క్ర‌మ‌ణ గేట్ల వివ‌రాల‌ను అందుబాటులో ఉంచారు.

చైల్డ్ ట్యాగ్‌లు..

           టిటిడి భ‌ద్ర‌తా విభాగం, పోలీసు విభాగం ఆధ్వ‌ర్యంలో పిల్ల‌లకు చైల్డ్ ట్యాగ్‌లు క‌డుతున్నారు. ర‌ద్దీ స‌మ‌యంలో త‌ల్లిదండ్రుల నుండి పిల్ల‌లు త‌ప్పిపోతే ఈ ట్యాగ్‌ల సాయంతో గుర్తించే అవ‌కాశ‌ముంది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు