కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు..!
తిరుమల, త్రిశూల్ న్యూస్ :
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో ఛర్నాకోల్ చేతబట్టి రాజమన్నార్ రూపధారిగా దేవదేవుడు భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీవారి వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రాత్రికి సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు 8 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. గురువారం శ్రీవారిని 61,879 మంది దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ద్వారా తితిదేకు 1.82కోట్ల ఆదాయం సమకూరింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.
Comments
Post a Comment