ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్ డైట్ ఛార్జీలను పెంచండి - సీఎం జగన్
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెనూ తయారు చేసి రోగులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ సమీర్ శర్మ, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం సీఎం జగన్ సమీక్షించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తోన్న ఆహారం నాణ్యతపై ఆరా తీశారు. మరింత రుచికరమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్ డైట్ ఛార్జీలను పెంచాలన్నారు. ఆరోగ్యశ్రీ పేషెంట్ల తరహాలోనే డైట్ ఛార్జీలను రోజుకు రూ.100కు పెంచాలని ఆదేశించారు. నిశితంగా పరిశీలన చేసి మంచి మెనూ తయారు చేయాలని చెప్పారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపుపైనా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఏడాదికి దాదాపు 3 రెట్లు పెరిగిన ఖర్చు..
వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్త చికిత్సల చేరికలపైనా సీఎం ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ జాబితాలోకి కొత్త చికిత్సల చేరిక దాదాపు ఖరారు చేసినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అక్టోబరు 5కు బదులు, అక్టోబరు 15న ఆరోగ్యశ్రీ జాబితాలోకి మరిన్ని ప్రొసీజర్ల చేరిక కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం నిర్ణయించారు. దీంతో పాటు ఫ్యామిలీ డాక్టర్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతం వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీలో 2,446 చికిత్సలు ఉండగా.. కొత్త వాటి చేరికతో ఆ సంఖ్య 3,254కు చేరనున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ, అనుబంధ సేవల కింద గత ప్రభుత్వ హయాంలో చేసిన ఖర్చుతో పోల్చితే ప్రస్తుతం ఏడాదికి దాదాపు మూడు రెట్లు ఖర్చు పెరిగిందన్నారు. పెరిగిన ప్రొసీజర్లతో ఏడాదికి ఆరోగ్యశ్రీకి సుమారుగా రూ.2,500 కోట్లు, ఆరోగ్య ఆసరా కోసం సుమారు రూ.300 కోట్లు, 108, 104 వాహనాల కోసం సుమారు మరో రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. డిసెంబర్ నాటికి మరో 432 కొత్త వాహనాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఆ నివేదికలు ఉన్నతాధికారులకు చేరాలి..
''ఆస్పత్రుల్లో ఉండాల్సిన స్థాయిలో సిబ్బంది ఉండాలి. దీని కోసం ప్రతినెలా ఆస్పత్రుల వారీగా ఆడిట్ చేయాలి.. ఆ నివేదికలు ఉన్నతాధికారులకు చేరాలి. క్రమం తప్పకుండా దీన్ని పర్యవేక్షించాలి. ఎక్కడ సిబ్బంది ఖాళీ ఉన్నా వెంటనే మరొకరిని నియమించడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా చూడటం, నిరంతరం ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు తగిన చర్యలు తీసుకునేలా మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుపై అధికారులు ఆలోచన చేయాలి. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపైన మరింత దృష్టి పెట్టాలి'' అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అర్బన్ హెల్త్ క్లినిక్స్‌ల నిర్మాణం నవంబర్ నెలాఖరుకల్లా పూర్తవుతాయని అధికారులు సీఎంకు తెలిపారు.
Comments
Post a Comment