సర్వభూపాల వాహనంపై ఓలలాడిన శ్రీ మలయప్ప స్వామి..!
తిరుమల, త్రిశూల్ న్యూస్ :
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉభయ దేవేరులతో కలిసి నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి తిరుమల దేవస్థానం చేర్మెన్ వైవి. సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment