కుప్పంలో ఆర్టీసీ సేవలు పునరుద్దించాలి - చంద్రబాబు
- ఎపిఎస్ ఆర్టీసీ ఎండికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
కుప్పం ఆర్టీసీ డిపో నుంచి వెళ్లే సర్వీసులు తగ్గించడం, పలు ప్రాంతాలకు సర్వీసులు రద్దు చెయ్యడంపై తెలుగు దేశం పార్టీ అధినేత, కుప్పం శాసన సభ్యులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండికి లేఖ రాసారు. కుప్పం ఆర్టీసీ డిపో దాదాపు 40 ఏళ్లుగా సేవలను అందిస్తోందని, నాలుగు సంవత్సరాల క్రితం కుప్పం ఆర్టీసీ డిపో నుంచి దాదాపు 105 సర్వీసులు నడుస్తుండగా ప్రస్తుతం రోజుకు 54 సర్వీసులకే పరిమితం చేశారని లేఖలో పేర్కొన్నారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి వివిధ వర్గాల ప్రజలు నిత్యం కుప్పంకు రాకపోకలు సాగిస్తుంటారని ఎండి దృష్టికి తీసుకెళ్లారు. కుప్పం నుంచి విజయవాడ, చెన్నై, బెంగళూరు వెళ్లే సర్వీసులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, కుప్పం నుంచి తిరుమలకు కూడా సర్వీసులను తగ్గించి చిత్తూరుకు సర్వీసును తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సర్వీసులు తగ్గడంతో రైతులు, విద్యార్థులు, వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, కుప్పం నుంచి ఇతర ప్రాంతాలకు తొలగించిన సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని చంద్రబాబు లేఖ ద్వారా ఆర్టీసీ ఎండికి తెలియజేసారు.
Comments
Post a Comment