తిరుప‌తిలో రేపటి నుండి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ - టిటిడి

- ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
తిరుప‌తిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీ‌నివాసం కాంప్లెక్స్‌, గోవింద‌రాజ‌స్వామి స‌త్రాల వ‌ద్ద మంగ‌ళ‌వారం నుంచి ప్ర‌యోగాత్మ‌కంగా స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ ప్ర‌క్రియ పునఃప్రారంభం కానున్న నేప‌థ్యంలో టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో వీర‌బ్ర‌హ్మం, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి సోమ‌వారం సాయంత్రం ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. టోకెన్ల జారీ కౌంట‌ర్లు, క్యూలైన్లు, భ‌క్తుల‌కు క‌ల్పించాల్సిన స‌దుపాయాల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా భూదేవి కాంప్లెక్స్ వ‌ద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు మంగ‌ళ‌వారం నుంచి ప్ర‌యోగాత్మ‌కంగా తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని పునఃప్రారంభిస్తున్నామ‌ని చెప్పారు. శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగ‌తా రోజుల్లో రోజుకు 15 వేల టోకెన్లు జారీ చేస్తామ‌న్నారు. టోకెన్ ల‌భించిన భ‌క్తుడు అదేరోజు ద‌ర్శ‌నం చేసుకునేలా ఏర్పాటు చేసిన‌ట్టు చెప్పారు. మూడు ప్రాంతాల్లో 30 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తామ‌ని, నిర్దేశిత కోటా పూర్తవగానే కౌంటర్లు మూసివేస్తామని వివరించారు. టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శించుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేశామ‌న్నారు. టోకెన్ల జారీ ప్ర‌క్రియ‌లో ఎదుర‌య్యే లోటుపాట్ల‌ను స‌రిదిద్దుకుంటూ క్ర‌మంగా టోకెన్ల సంఖ్య‌ను పెంచుతామ‌ని తెలిపారు. ఆధార్ న‌మోదు చేసుకుని టోకెన్లు జారీ చేయ‌డం వ‌ల్ల భ‌క్తులు ద‌ర్శ‌నం చేసుకున్నా, చేసుకోక‌పోయినా నెల‌కు ఒక‌సారి మాత్ర‌మే టోకెన్ పొందే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.  
      తిరుమ‌ల‌లో వ‌స‌తికి సంబంధించి ఒత్తిడి త‌గ్గించ‌డం కోసం డిసెంబర్ 1వ తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ దాతలకు తిరుపతిలోని మాధవంలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేస్తామ‌ని, అక్క‌డే గదులు కేటాయిస్తామ‌ని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంట ఎస్ఈ (ఎల‌క్ట్రిక‌ల్‌) వెంక‌టేశ్వ‌ర్లు, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు, విజివో మ‌నోహ‌ర్‌, ఈ ఈలు మురళీ కృష్ణ, సుమతి, కృష్ణారెడ్డి, చీఫ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ ఆఫీస‌ర్ సందీప్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు