పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్..!

- జండా ఊపి రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ
మచిలీపట్నం, త్రిశూల్ న్యూస్ :
కుల, మత, వర్గ, లింగ బేధాలు లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో మెలుగుతూ, జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని కృష్ణా జిల్లా ఎస్పీ పి.జాషువా అన్నారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గారి జయంతి పురస్కరించుకొని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయం నుండి స్థానిక లక్ష్మీ టాకీస్ సెంటర్ మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయం వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించగా, జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పి అడ్మిన్ ఎన్ వెంకట రామాంజనేయులు, సెబ్ అడిషనల్ ఎస్పీ అస్మా ఫర్హిన్, ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్ వి డి ప్రసాద్ లతో కలిసి జండా ఊపి ఐక్యత పరుగును ప్రారంభించారు. ఈ పరుగు నందు పోలీస్ అధికారులు, సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మనమంతా సమానమే అని చాటారు.
అనంతరం ఏ ఆర్ పోలీస్ పెరేడ్ మైదానంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటానికి ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు పూలమాలలు వేసి, పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దేశ ఐక్యతకు, అంతర్గత భద్రతకు కట్టుబడి ఉంటామని, ఎస్పీ సిబ్బంది అందరితో ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారతదేశం 564 సంస్థానాలుగా విడిపోయి ఉన్న దేశాన్ని ఒకటిగా చేసి ఏకతాటిపై నడిపించిన మహనీయుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు. ఈరోజు ఆయన జన్మదినాన్ని రాష్ట్రీయ ఏక్తా దివాస్ గా జరుపుకోవడం గర్వించదగిన అంశమన్నారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన పాత్ర అద్భుతమని, అందుకు ప్రతీకగా హైదరాబాదులోని జాతీయ పోలీస్ అకాడమీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని నామకరణం చేయడం ఆయన యొక్క గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు. ఇంగ్లాండ్లో బారిష్టర్ పట్టా పుచ్చుకొని, స్వదేశానికి తిరిగి వచ్చి దేశంలో జరుగుతున్న జాతీయ ఉద్యమానికి ఆకర్షితుడై మహాత్మా గాంధీ నిరాకరణ ఉద్యమంలో భాగస్వామ్యం వహించి, స్వతంత్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించారని గుర్తు చేశారు. అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతిలో పరిష్కరించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. మరణానంతరం భారతరత్న బిరుదుతో ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించిదాన్నారు. చరిత్ర పుటల్లో నిలిచిపోయే వ్యక్తిత్వం కలిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం మనందరికీ ఆదర్శమని, దేశ సమగ్రతను కాపాడిన వ్యక్తి పటేల్ అన్నారు. ఆయన సంకల్పాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని దేశ సమైక్యతకు సమగ్రతకు కృషి చేయాలని అంతర్గత భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి జాతీయ ఐక్యతలో భాగ్యం కావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీలు భారత్ మాతాజీ, రమేష్, విజయకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీసు అధికారులు, సచివాలయ మహిళా పోలీసులు విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు