సమస్యల పరిష్కారం కోసమే వ్యవసాయ సలహా మండలి సమావేశం..!
మచిలీపట్నం, త్రిశూల్ న్యూస్ :
వ్యవసాయ, ఆక్వా రంగాలలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికే వ్యవసాయ సలహా మండల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని స్పందన సమావేశపు హాల్లో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో జిల్లా అధ్యక్షులు జన్ను రాఘవరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా మాట్లాడుతూ గ్రామ, మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో సూచనలు, సలహాలను పరిగణన లోనికి తీసుకుని జిల్లా స్థాయిలో చర్చించి ప్రభుత్వానికి నివేదించి అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఖరీఫ్, రభీ పంట కాలాల్లో తప్పనిసరిగా ఈ క్రాప్ ద్వారా రైతులు తమ పంటలను నమోదు చేసుకోవాలన్నారు. పకృతి వైపరీత్యాలు, దాన్యం కొనుగోలు, రాయితీపై విత్తనాలు, సున్నా వడ్డీ పంటల రుణాలు, పంటల బీమా, ఎరువులు, పురుగు మందుల సబ్సిడీ ఈ క్రాప్ డేటా ద్వారానే రైతులు పొందగలరన్నారు. ఇదే విధానం ఆక్వా, ఉద్యానవన పంటలకు కూడా అమలు జరుగుతుందన్నారు. ఈ క్రాపు నమోదులో వ్యవసాయ అధికారులతో పాటు రైతులు కూడా అంతే బాధ్యతగా ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతులకు చెల్లించాల్సిన నగదు సకాలంలో జమచేయడం జరిగిందని, ఒకటి రెండు చోట్ల సాంకేతిక సమస్యల వలన ఆగినా సరిచేసి వెంటనే జమ చెయ్యాలని అధికారులను అయన ఆదేశించారు. ఈ- క్రాప బుకింగ్ సోషల్ ఆడిట్ సక్రమంగా నిర్వహించాలన్నారు. సాధారణంగా ప్రతీ ఏటా అక్టోబరు నుంచి డిసెంబరు నెల వరకు తుపాన్లు, భారీ వర్షాలు ఉంటాయి. ఖరీఫ్ పంట ఆలస్యం అవుతుండడంతో నవంబరు నెలాఖరుకు పంట చేతికందే పరిస్థితి ఉంది. సరిగ్గా అదే సమయంలో ప్రకృతి వైఫరీత్యాలు విరుచుకుపడుతుంటాయి. మరికొన్ని రోజుల్లో ఆరుగాలం పండించిన పంట చేతికందుతుందన్న తరుణంలో భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతుంటారని చెబుతూ, మంచి ఉద్దేశంతో రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఈ సమావేశాన్ని సక్రమంగా కచ్చితంగా ప్రతినెల నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాస్థాయిలో ఉన్న సమస్యలను వెంటనే సంబంధిత శాఖ అధికారులు పరిష్కరించే దిశగా కార్యచరణ ఏర్పాటు చేసి మరలా ఈ సమావేశంకు యాక్షన్ ప్లాన్ నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాస్థాయిలో ఉన్న సమస్యలు, సూచనలు ప్రతి నెల నాలుగో వారం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే వ్యవసాయ సలహా మండలి సమావేశం లో రాష్ట్ర కమిటీకి నివేదిక అందజేస్తామని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. అనంతరం, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు జన్ను రాఘవరావు మాట్లాడుతూ, ఈ క్రాప్ నమోదు చేసేందుకు సీ సీ ఆర్ సి కార్డ్ లేకపోయినా కల్టివేటర్ గా నమోదు చేయాలని కోరారు. వ్యవసాయ యాంత్రికరణలో వ్యక్తిగతంగా స్ప్రేయర్లు, టార్పలిన్లు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై ఇప్పించాలని కోరారు. అవసరం మేరకు మాత్రమే ఏ యం సి యు లు పంచాయతీలకు ఇప్పించాలని కోరారు. ఖరీఫ్ 2020-21 ఇన్సూరెన్స్ బకాయిలు త్వరగా రైతుల ఖాతాలో జమ చేయాలని కోరారు. మురుగు కాలువల్లో పూడికతీత, మేజర్ , మైనర్ డ్రైన్లలో తూడు తొలగింపు పనులను త్వరితగతిన చేయాలని అన్నారు. కంకిపాడు, పెనమలూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, అవనిగడ్డ మండలాల్లో పలువురు రైతులు దాళ్వా సాగుకు అనుమతి అడుగుతున్నట్లు పేర్కొంటూ, ఒక 50 టి ఎం సి సాగునీరు విడుదల చేస్తే బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే, ధాన్యంలో ఏ గ్రేడ్ 1061 రకంలో ఎండుతెగులు వస్తున్నట్లు ఆకు మాడిపోతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారని జిల్లా వ్యవసాయాధికారికి తెలిపారు. మినుములో ఎల్ పి జి 2052 సబ్సిడీతో ప్రభుత్వం కిలో 79 రూపాయలకు అందచేస్తుందని అయితే ప్రయివేట్ మార్కెట్ లోనూ అదే ధరకు లభ్యమవుతున్నట్లు తెలిపారు. అల్లాగే 100 కౌంట్ రోయ్యల ధరలను 180 రూపాయలకు మించి ఎక్కడా కోండం లేదని, రొయ్యల ధరలు పతనావస్థలో కావాలనే కొందరు వ్యాపారస్తులు ఉంచుతున్నారని, ప్రభుత్వం వీటి ధరలను పర్యవేక్షించి కొనుగోలు కేంద్రాలపై నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో వివిధ మండలాల్లో ఉన్న సమస్యలను జన్ను రాఘవరావు ఈ సందర్భంగా వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండల సమావేశంలో సభ్యులు శ్రీకాకుళపు నాగేశ్వరరావు, పట్టపు శ్రీనివాసరావు, పర్ణం పెద్దబాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ వై వి ఎస్ మనోహర రావు, హర్టి కల్చర్ అధికారి, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, హార్టికల్చర్, మత్స్యశాఖ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment