పుట్టినరోజు వేడుకలో విషాదం.. 21మంది సజీవదహనం..!
పాలస్తినా, త్రిశూల్ న్యూస్ :
పాలస్తీనా గాజా నగరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో శరణార్థుల శిబిరంలో పెను విషాదం నెలకొంది. గాజా స్ట్రిప్ లోని ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 21మంది సజీవ దహనమయ్యారు. ఆ ఇంట్లో అప్పటి వరకు ఆనందంగా జరుగుతున్న ఓ పుట్టిన రోజు వేడుక కాస్త చివరికి విషాదంగా ముగిసింది. ఈ ప్రమాదంలో ఓ కుటుంబమే తుడిచిపెట్టుకు పోయింది. ఈ ప్రమాదంలో 21 మంది చనిపోగా వారిలో 17మంది ఒకే కుటుంబీకులు కావడం హృదయాలను పిండేస్తోంది. సజీవ దహనం అయిన వారిలో 7గురు చిన్నారులు ఉన్నారు. గాజాలోని అత్యధిక జనసాంద్రత ఉండే జబాలియా శరణార్థుల క్యాంపు ప్రాంతంలోని నాలుగంతస్తుల ఇంట్లో మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. జబాలియా శరణార్థుల శిబిరంలో తొలుత మొదటి అంతస్తులో ప్రమాదం అంటుకుంది. అనంతరం మూడు అంతస్తులకు వ్యాప్తి చెందాయని అధికారులు చెబుతున్నారు. ఇంట్లో నిల్వచేసిన పెట్రోలుకు మంటలు అంటుకోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్నా.. దానికి మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై స్పష్టత లేదు. ఆ ఇంట్లో ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకతోపాటు, ఈజిప్టు నుంచి ఓ వ్యక్తి రావడంతో ఆనందంతో అందరూ కలిసి వేడుక జరుపుకున్నారు. ఈ క్రమంలో సంభవించిన అగ్ని ప్రమాదం వారిని పూర్తిగా తుడిచిపెట్టేసింది. ప్రమాదం గురించి చెప్పేందుకు కుటుంబ సభ్యుల్లో ఒకరు కూడా మిగలకపోవడం విషాదం. కాకపోతే.. ప్రమాదానికి పెట్రోలే కారణమన్న వార్తలను అబూ రయా బంధువు మహ్మద్ అబూరయా కొట్టిపడేశారు. వారి ఇంట్లో ఫర్నిచర్ అధికంగా ఉందని, మంటలు పెద్ద ఎత్తున చెలరేగడానికి అది కూడా కారణమై ఉంటుందని అన్నారు. బాధిత కుటుంబంలో మూడు తరాలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. గాజా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఇళ్లలో పెట్రోలు, డీజిల్, గ్యాస్‌ను నిల్వచేసుకోవడం ఇక్కడి ప్రజలకు పరిపాటిగా మారింది. ఇప్పుడదే వారి ప్రాణాలు తీస్తోంది. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఈ అగ్ని ప్రమాదాన్ని జాతీయ విషాదంగా అభివర్ణించారు. కాగా, బిల్డింగ్‌లో ఓ ఇంట్లో ఇంధనం నిల్వ చేయడంతో అగ్నిప్రమాదం జరిగిందని సివిల్ డిఫెన్స్ యూనిట్ ప్రతినిధి చెప్పారు. గాజాలోని ఎనిమిది శరణార్థుల క్యాంపుల్లో జబాలియా ఒక్కటి. ఇక్కడ 20 లక్షల 30 వేల మంది నివాసముంటున్నారు.
Comments
Post a Comment